Gold: రాత్రికి రాత్రే టన్నుల కొద్దీ బంగారం తరలింపు.. మోదీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ ఇదేనా?
భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) గత రెండేళ్లుగా అత్యంత నిశ్శబ్దంగా ఒక భారీ మిషన్‌ను నిర్వహిస్తోంది. దశాబ్దాలుగా విదేశాల్లో, ముఖ్యంగా లండన్‌లోని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాల్టుల్లో భద్రపరిచిన మన బంగారాన్ని వెనక్కి తీసుకువస్తోంది. కేవలం తీసుకురావడమే కాదు, మన విదేశీ మారక ద్రవ్య నిల్వలలో (Forex Reserves) బంగారం వాటాను కూడా గణనీయంగా పెంచుతోంది. తాజాగా వెలువడిన ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం, ఇండియా వద్ద ఉన్న మొత్తం బంగారం (Gold) లో ఇప్పుడు మూడింట రెండు వంతులు మన దేశంలోనే భద్రంగా ఉంది.

బంగారం లెక్కలు ఇవే!
మార్చి 2026 నాటికి భారత ఆర్బీఐ వద్ద మొత్తం 880.52 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలు (Gold reserves) ఉన్నాయి. ఇందులో 680.05 మెట్రిక్ టన్నుల బంగారాన్ని ఇప్పుడు భారతదేశంలోని వాల్టులలోనే భద్రపరిచారు. రెండేళ్ల క్రితం వరకు సగం కంటే తక్కువ బంగారం మాత్రమే మన దేశంలో ఉండేది. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం (10 గ్రాములకు రూ. 95,000), మన దగ్గర ఉన్న మొత్తం పసిడి విలువ సుమారు రూ. 8.36 లక్షల కోట్లు. అందులో మన గడ్డపై ఉన్న బంగారం విలువ రూ. 6.46 లక్షల కోట్లు.
బంగారాన్ని వెనక్కి ఎందుకు తెస్తున్నారు?
దీని వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. ప్రధానంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితి (Geopolitical Uncertainty) పెరగడమే దీనికి కారణం. 2022లో ఉక్రెయిన్ యుద్ధం తర్వాత, పాశ్చాత్య దేశాలు రష్యాకు చెందిన విదేశీ నిల్వలను స్తంభింపజేశాయి. దీనివల్ల మన ఆస్తులను వేరే దేశాల్లో ఉంచడం ఎంత ప్రమాదకరమో ప్రపంచానికి అర్థమైంది. సంక్షోభం వచ్చినప్పుడు మన బంగారాన్ని మనం వాడుకోవాలంటే అది మన దగ్గరే ఉండాలి తప్ప వేరే దేశం దయపై ఆధారపడకూడదు. అందుకే 'సెక్యూరిటీ' , 'స్వయం సమృద్ధి'లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
డాలర్ పై ఆధారపడటం తగ్గించడమే లక్ష్యం!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు ఇప్పుడు అమెరికన్ డాలర్ పై ఆధారపడటం తగ్గించి, బంగారానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. మార్చి 2026 నాటికి మన మొత్తం రిజర్వులలో బంగారమే 16.7 శాతానికి చేరుకుంది. ఆరు నెలల క్రితం ఇది 13.92 శాతం మాత్రమే. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఒకవేళ రూపాయి విలువ పడిపోయినా లేదా ఆయిల్ ధరలు పెరిగినా, ఈ బంగారం నిల్వలు మనల్ని కాపాడతాయి.
మన ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది?
ప్రస్తుతం మన దేశం దగ్గర సుమారు 11 నెలల దిగుమతులకు సరిపడా విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్నాయి. అంటే, మరో పదకొండు నెలల పాటు మనకు విదేశాల నుంచి ఒక్క రూపాయి రాకపోయినా, మనం ఇతర దేశాల నుంచి సరుకులు కొనుగోలు చేయగలం. ఇది అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం చాలా మెరుగైన పరిస్థితి. ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సామాన్య ప్రజలకు కలిగే ప్రయోజనం ఏంటంటే.. దేశ ఆర్థిక వ్యవస్థ సుస్థిరంగా ఉంటుంది. బయటి దేశాల్లో ఎలాంటి యుద్ధాలు లేదా ఆర్థిక సంక్షోభాలు వచ్చినా భారత్ తట్టుకోగలదు అనే ధీమా ఈ నివేదికతో పెరిగింది. మన పసిడి మన గడ్డపైనే ఉండటం అనేది ఆత్మనిర్భర్ భారత్‌కు ఒక నిదర్శనం!


Click it and Unblock the Notifications