బంగారం దెబ్బకు వజ్రాల మార్కెట్ ఢమాల్.. రూ.18 వేల కోట్ల పెట్టుబడి పెట్టి చేతులు కాల్చుకున్న డీ బీర్స్..
పసిడి మెరుపుల మధ్య వజ్రాలు తన ఆకర్షణను కోల్పోతున్నాయి. ఒకప్పుడు రారాజుగా వెలుగొందిన వజ్రం నేడు బంగారం చేతిలో చిక్కి చిక్కి విలవిలలాడుతోంది. కంపెనీలు మూసివేత దిశగా పయనిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం వజ్రాలకు మార్కెట్లో గతంలో ఉన్న డిమాండ్ లేకపోవడమేనని చెప్పవచ్చు. తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వజ్రాల ఉత్పత్తిదారు అయిన డి బీర్స్.. దక్షిణాఫ్రికాలోని తన ప్రతిష్టాత్మక వెనీషియా డైమండ్ మైన్‌లో రాబోయే రెండు సంవత్సరాల పాటు ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించుకుంది.
ఈ గనిని ఓపెన్-పిట్ నుండి భూగర్భ మైనింగ్‌గా మార్చడానికి కంపెనీ గత పదేళ్లలో దాదాపు 2.2 బిలియన్ డాలర్ల (సుమారు రూ.18 వేల కోట్లకు పైగా) భారీ పెట్టుబడి పెట్టింది. అయినప్పటికీ.. అంతర్జాతీయంగా పడిపోతున్న వజ్రాల ధరలు, బలహీనమైన డిమాండ్ కారణంగా ప్రస్తుతానికి మైనింగ్ నిలిపివేయడమే మార్గమని కంపెనీ భావిస్తోంది. దక్షిణాఫ్రికా మొత్తం వజ్రాల ఉత్పత్తిలో వెనీషియా గని వాటా సుమారు 40 శాతం కాగా.. డి బీర్స్ అంతర్జాతీయ సరఫరాలో ఇది 10 శాతం వాటాను కలిగి ఉంది.

ఈ అసాధారణ నిర్ణయానికి మార్కెట్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితులే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సహజ వజ్రాలకు డిమాండ్ చాలా బలహీనంగా ఉంది. 2022 నాటి రికార్డు గరిష్టాలతో పోలిస్తే ముడి వజ్రాల ధరలు ప్రస్తుతం దాదాపు 50 శాతం వరకు పడిపోయాయి. దీనికి తోడు డి బీర్స్ వద్ద, అలాగే వివిధ దేశాల్లోని వజ్రాల వ్యాపారులు, శుద్ధి కంపెనీల వద్ద ఇప్పటికే భారీగా నిల్వలు పేరుకుపోయాయి. ఇలాంటి సమయంలో వెనీషియా గని నుండి మరింత ఉత్పత్తిని కొనసాగిస్తే మార్కెట్లోకి సరఫరా పెరిగి ధరలపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. అందుకే డిమాండ్-సరఫరాల మధ్య సమతుల్యతను తీసుకురావడానికి.. ధరలను స్థిరీకరించడానికి డి బీర్స్ తాత్కాలికంగా ఉత్పత్తిని ఆపివేసి.. వజ్రాలను భూగర్భంలోనే భద్రంగా ఉంచాలని నిర్ణయించింది.
ఈ గ్లోబల్ సంక్షోభానికి చైనా ఆర్థిక పరిస్థితి కూడా ఒక ముఖ్య కారణంగా చెప్పవచ్చు. ప్రపంచ వజ్రాభరణాల మార్కెట్లో 14 శాతం వాటాతో రెండవ అతిపెద్ద వినియోగదారుగా ఉన్న చైనా ఆర్థిక వ్యవస్థ.. ఇటీవలి కాలంలో మందగించింది. దీని వల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గి.. వారు ఖరీదైన వజ్రాల కంటే సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా చైనాలో బంగారు కడ్డీలు, నాణేల అమ్మకాలు ఏకంగా 35.1 శాతం పెరిగాయి. చైనా మార్కెట్లో వజ్రాల ఆర్డర్లు పడిపోవడంతో సరఫరా గొలుసు మొత్తం స్తంభించిపోయి.. ముడి వజ్రాల అమ్మకాలు భారీగా క్షీణించాయి.
ఈ పరిణామాలు ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల కోత, పాలిషింగ్ కేంద్రమైన భారతదేశంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ప్రపంచంలోని 90 శాతం ముడి వజ్రాలను పాలిష్ చేసే సూరత్, ముంబై నగరాలు ప్రస్తుతం ఆర్డర్లు లేక సతమతమవుతున్నాయి. చైనా, ఇతర దేశాల నుండి డిమాండ్ తగ్గడంతో భారతీయ ఎగుమతిదారుల వద్ద పాలిష్ చేసిన వజ్రాలు పెద్ద ఎత్తున పేరుకుపోయాయి. దీని ప్రభావంతో ఆర్థిక సంవత్సరంలో భారతదేశపు కట్, పాలిష్ చేసిన వజ్రాల ఎగుమతులు 8.5 శాతం తగ్గి 12.16 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఇది గత 20 ఏళ్లలోనే అత్యల్ప స్థాయి కావడం గమనార్హం.
మరోవైపు సహజ వజ్రాల మార్కెట్‌కు ల్యాబ్-గ్రోన్ (ప్రయోగశాలలో తయారుచేసే) వజ్రాల నుండి గట్టి పోటీ ఎదురవుతోంది. రూపంలోనూ, నాణ్యతలోనూ సహజ వజ్రాల తరహాలోనే ఉంటూ.. అత్యంత తక్కువ ధరకే లభిస్తుండటంతో వీటికి ఆదరణ వేగంగా పెరుగుతోంది. ఈ విభాగంలో కూడా భారతదేశం, చైనాలు ప్రధాన ఉత్పత్తిదారులుగా ఎదిగాయి. ఇటీవల భారతదేశం నుండి పాలిష్ చేసిన ల్యాబ్ వజ్రాల ఎగుమతులు దాదాపు 2 శాతం పెరిగి 194.78 మిలియన్ డాలర్లకు చేరుకోవడం దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
భారీ పెట్టుబడులు పెట్టినప్పటికీ ఉత్పత్తిని నిలిపివేయడం వెనుక డి బీర్స్ తీసుకున్న ఒక వ్యూహాత్మక చర్య వెనుక కారణం లేకపోలేదు. ఇప్పటికే పెట్టిన 2.2 బిలియన్ డాలర్ల వ్యయం ఎలాగూ తిరిగి రాదు కాబట్టి.. ప్రస్తుత బలహీనమైన మార్కెట్ ధరల్లో ఉత్పత్తిని కొనసాగించి నష్టాలు పెంచుకోవడం కంటే పని ఆపడమే మేలని కంపెనీ భావించింది. తద్వారా నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడం, మార్కెట్లోకి కొత్త సరఫరాను నియంత్రించడం.. భవిష్యత్తులో ధరలు కోలుకున్నప్పుడు పూర్తి సామర్థ్యంతో తవ్వకాలు జరిపి గరిష్ట లాభాలు సాధించడం కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. వెనీషియాలో మైనింగ్ ఆపినప్పటికీ, ఇతర గనుల ద్వారా తమ మొత్తం ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవడానికి డి బీర్స్ మైనింగ్ కంపెనీ ప్రయత్నిస్తోంది.


Click it and Unblock the Notifications
