Gold Rates : బంగారం ధరలు పెరగడం..తగ్గడం అనేది మిస్టరీగా మారుతోంది. ఒక్కసారిగా ఆకాశాన్నితాకిన బంగారం ధరలు మళ్లీ అదే సమయంలో పాతాళానికి పడిపోతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతుందా అని పసిడి ప్రియులు తలలు పట్టుకుంటున్నారు. 2025 మొదటి త్రైమాసికం నాటికి పసిడి ధరలు ఎన్నడూ లేని విధంగా పెరిగాయి. పెట్టుబడిదారులు అన్ని అంశాలను వదిలి బంగారం మీద పెట్టుబడుల కోసం ఎగబడ్డారు. ద్రవ్యోల్బణం, యుద్ధాల భయాలు, ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ గందరగోళంతో ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షితమైన డిమాండ్ గా పరిగణించారు.
అయితే ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కాని బంగారం ఊపు తగ్గిపోయింది. ధరలు స్థిరంగా తగ్గడం స్టార్ట్ అయింది. గత వారం విడుదలైన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) నివేదిక ప్రకారం చూసుకున్నట్లయితే బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు తగ్గడమేనని నిపుణులు చెబుతున్నారు. మొదటి త్రైమాసికంలో 243 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసిన బ్యాంకులు..రెండవ త్రైమాసికంలో 166 టన్నులు మాత్రమే కొనుగోలు చేశాయి. బంగారం ర్యాలీకి ఈ కేంద్ర బ్యాంకులే కారణమని నిపుణులు చెబుతున్నారు.

ఇదే సమయంలో ప్లాటినం ధరలు ఊపందుకోగా.. బిట్‌కాయిన్ ధరలు నింగిని తాకాయి. వీటి ఫలితంగా ఇన్వెస్టర్లకు బంగారం మీద మోజు తగ్గిపోయింది. దీనికి తోడు డాలర్ స్థిరంగా ఉండటంతో పసిడిపై వ్యామోహం మరింతగా తగ్గిపోయింది. చైనా, భారత్ దేశాల నుంచి ఆభరణాల డిమాండ్ భారీగా తగ్గడం కూడా కారణంగా చెప్పుకోవచ్చు. బంగారు ఆభరణాల వ్యాపారులు ఖర్చులను తగ్గించేందుకు తక్కువ క్యారట్ల బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా 24 క్యారట్ల బంగారానికి డిమాండ్ తగ్గిపోయింది.
ఇక మరో అంశం ఏంటంటే.. రష్యాపై ఆంక్షలు అని చెప్పుకోవచ్చు. అగ్రరాజ్యం అమెరికా రష్యా పై ఆంక్షల అనంతరం విదేశీ ముదుపుదారులు స్టాక్ మార్కెట్ వదిలేసి బంగారాన్ని సురక్షితమైన డిమాండ్ గా పరిగణించారు. మళ్లీ పరిస్థితులు సద్దుమణగగానే వారు బంగారం నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. దీంతో బంగారం ధర ఒడిదుడుకులకు లోనైంది. ప్రస్తుతం చైనాతో పాటుగా చాలా దేశాలు బంగారం మీద తమ దృష్టిని పెట్టాయి.
ఓ అంచనా ప్రకారం..చైనా వాస్తవిక బంగారం నిల్వలు 5 వేల టన్నులకు పైగా ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా బంగారం ధరలు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నా భవిష్యత్తులో మాత్రం ధరలు విపరీతంగా పెరిగే అవకాశం అయింది. కేంద్ర బ్యాంకుల భద్రతా వ్యూహాలు, భౌగోళిక రాజకీయ పరిస్థితులు బంగారం ధరలను ఈ సారి గట్టిగానే ప్రభావితం చేసే అవకాశం ఉంది.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.


Click it and Unblock the Notifications