భారత్‌లో ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు అమెరికా కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ ఇటీవల ప్రకటించింది. దేశీయ మార్కెట్లో పట్టు కోసం ప్రయత్నించిన ఈ సంస్థ ఇప్పుడు వెళ్లిపోతోంది. పోటీ సంస్థలు మార్కెట్లో దూసుకు పోతుండగా, ఫోర్డ్ మాత్రం భారతీయులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో మార్కెట్ లేక తన రెండు ప్లాంట్స్ క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. భారత్‌లోని రెండు ప్లాంట్లు చెన్నై (తమిళనాడు), సనంద్(గుజరాత్)లలో వాహన తయారీ యూనిట్లలో కార్ల తయారీని నిలిపివేస్తోంది. వ్యాపార పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా దిగుమతి చేసుకున్న కార్లను మాత్రమే ఇక్కడ విక్రయించనుంది. 250 కోట్ల డాలర్ల భారీ పెట్టుబడులతో చెన్నై, సనంద్‌లో వాహన తయారీ యూనిట్లను ఏర్పాటు చేసుకుంది. ఈ ప్లాంట్లలో ఎకోస్పోర్ట్, ఫిగో, యాస్పైర్, ఫ్రీస్టైల్, ఎండీవర్ మోడల్స్‌ను తయారు చేస్తోంది.
ఈ ఏడాది చివరి అక్టోబరు-డిసెంబర్‌లో సనంద్ ప్లాంటులో వాహనాల అసెంబ్లింగ్‌ను, వచ్చే ఏడాది ఏప్రిల్-జూన్‌లో చెన్నై ప్లాంటులో వాహనాలు, ఇంజన్ల తయారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే భారత్ నుండి కంపెనీ పూర్తిగా నిష్క్రమించడం లేదు. ఉత్పత్తి నిలిపివేత తర్వాత లగ్జరీ కారు మస్టంగ్‌తో పాటు ఎలక్ట్రిక్ మోడల్స్‌ను దిగుమతి చేసుకొని విక్రయాలు జరపనుంది. ప్రస్తుత కస్టమర్లకు విడిభాగాలు, సర్వీసింగ్, వారంటీ సేవలను కొనసాగిస్తుంది. ఫోర్డ్ ఇండియాలో తన ప్లాంట్స్ మూసివేస్తున్న నేపథ్యంలో ఉద్యోగుల భవిష్యత్తుపై ఆందోళన నెలకొంది. అయితే చెన్నై యూనిట్ ఉద్యోగులకు కాస్త రిలీఫ్ వార్త.

చెన్నై సమీపంలోని యూనిట్‌ను మరో కంపెనీకి విక్రయించాలని ఫోర్డ్ ఇండియాను తమిళనాడు ప్రభుత్వం కోరింది. అలా జరిగితే ఆ యూనిట్‌లో పనిచేస్తున్న 2600 మంది ఉద్యోగులకు పెద్ద రిలీఫ్ అవుతుంది. ఫోర్డ్ కార్ల ఉత్పాదక కాంట్రాక్ట్ లేదా యూనిట్ విక్రయం కోసం ఓలా, మహీంద్రా అండ్ మహీంద్రాతోను చర్చలు జరిగాయి. ఈ సంస్థల మధ్య జరిగిన చర్చల ఫలితం బయటకు రాలేదు. ఫోర్డ్ మూసివేతతో నేరుగా 4000 మంది, పరోక్షంగా 40 వేలమందిపై ప్రభావం చూపనుంది. గుజరాత్‌లో సనంద్ యూనిట్ ప్రస్తుత త్రైమాసికంలో మూత పడుతుంది. చెన్నై ఫోర్డ్ యూనిట్ ఏడాదిలో 2 లక్షల కార్లు, 3.40 లక్షల ఇంజిన్‌ల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. వివిధ విదేశీ ఆటో కంపెనీలు భారతీయుడి నాడిని పట్టుకోలేకపోతున్నాయి. అందుకే ఇక్కడ తమ కార్యకలాపాలను క్లోజ్ చేస్తున్నాయి. వెస్టర్న్ కంట్రీస్‌తో పోలిస్తే భారతీయులు భిన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ఇక్కడ మధ్య తరగతి ప్రజలు ఎక్కువ. ఆదాయాల్లో తేడా ఉంటుంది. మన దేశంలో గ్రామీణ, పట్టణ అవసరాలు, ఆలోచనలు వేర్వేరుగా ఉంటాయి. ఇందుకు అనుగుణంగా ఫోర్డ్ వంటి విదేశీ సంస్థలు ఉత్పత్తిని చేయలేకపోయాయని అంటారు.
ఫోర్డ్ ఇరవై అయిదేళ్ల క్రితం భారత్‌లో అడుగు పెట్టింది. దశాబ్దాల పాటు ఇక్కడ నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేసి, విఫలమైంది. ఈ కంపెనీలో పద్మనాభన్ అనే ఉద్యోగి చెన్నై ప్లాంట్‌లో 1998 నుండి ఈ ప్లాంట్ ప్రారంభమైనప్పటి నుండి చేస్తున్నారు. పర్మినెంట్ ప్రొడక్షన్ లైన్ ఆపరేటర్‌గా కంపెనీలో దశాబ్దాలుగా ఎదిగాడు. రూ.50,000 వేతనం తీసుకుంటున్నాడు. లేబర్ యూనియన్ ట్రెజరర్‌గా ఎన్నికయ్యాడు.


Click it and Unblock the Notifications