పర్సనల్ లోన్స్ కంటే కారు లోన్, హౌసింగ్ లోన్ చాలా చౌకగా ఉన్న విషయాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా..? మీరు పర్సనల్ లోన్ కోసం ఎప్పుడు వెళ్లినా.. కనీసం 10 శాతం నుంచి 24 శాతం వరకు వడ్డీని ఫైనాన్స్ సంస్థలు ఛార్జ్ చేస్తుంటాయి. కానీ అవే సంస్థలు మరోవైపు.. హోమ్, కార్ లోన్స్ మాత్రం 6.5-9 శాతానికే అందిస్తుంటాయి. అసలు దీని వెనుక కారణాలు ఏమిటి, ఎందుకు బ్యాంకులు అలా చేస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పర్సనల్ లోన్స్ ఎందుకు ఖరీదంటే..
పర్సనల్ లోన్ ఖరీదైనవిగా ఉండటానికి అతి పెద్ద కారణం అది తక్కువ కాలానికి తీసుకునే లోన్ కావటమే. ప్రజలు ఎక్కువగా 1- 5 సంవత్సరాల కాలానికి పర్సనల్ లోన్స్ తీసుకుంటుంటారు. పైగా ఈ రకం రుణాలకు ఎలాంటి హామీ ఇవ్వనక్కర్లేదు కూడా. అంటే.. ఏదీ తనఖా పెట్టనక్కర్లేదు. అటువంటి పరిస్థితిలో లోన్ తీసుకున్న వ్యక్తి ఏదైనా కారణం వల్ల రుణాన్ని తిరిగి చెల్లించలేకపోతే, అప్పుడు బ్యాంకు నష్టపోతుంది. అందువల్లనే వ్యక్తిగత రుణాలకు ఎక్కువ వడ్డీ విధిస్తుంటాయి ఫైనాన్స్ సంస్థలు. కాబట్టే అవి ఖరీదైనవిగా ఉంటాయి.

హోమ్ లోన్స్ కు వడ్డీ ఎందుకు తక్కువ..
బ్యాంకుల నుంచి గృహ రుణాలు సరసమైన ధరల్లోనే లభిస్తాయి. ఈ రేటు సాధారణంగా 6.5-9% మధ్య ఉంటుంది. ప్రభుత్వం ప్రచారం చేయడమే దీనికి ప్రధాన కారణం కూడా. గృహ రుణాల కోసం అన్ని బ్యాంకులు, NBFCలకు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ద్వారా లోన్స్ అందుతాయి. బ్యాంకులు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నుంచి 2 శాతం తక్కువ ధరకు రుణాలను అవి పొందుతాయి. ఇల్లు కట్టాలంటే ఇటుకలు, ఇసుక, కంకర, రిబార్, సిమెంట్ అంటూ అనేక ఇతర ఖర్చులు అవుతాయి. అంటే.. దీని ద్వారా ఉపాధి కూడా అందుబాటులోకి వస్తుంది. అదే సమయంలో.. ఇంటి నిర్మాణం తర్వాత ఇంటీరియర్, ఫర్నిచర్ ఇతర అలంకారాలు కూడా చేస్తుంటారు. ఇలా ఆర్థిక వ్యవస్థలో అనేక రంగాలు కూడా లాభపడతాయి. కాబట్టే.. ప్రభుత్వం ఈ రకం లోన్స్ కు ప్రోత్సాహకాలను అందిస్తుంది. దీని వల్ల దేశంలోని ఆర్థిక వ్యవస్థ పరోక్షంగా నడుపబడుతుంది. పైగా ఇవి సెక్యూర్డ్ లోన్స్ కావటం వల్ల బ్యాంకులకు డిఫాల్టింగ్ వల్ల నష్టం కూడా ఉండదు.

మరి కార్ లోన్స్ ఎందుకు చౌకైనవి..
మీరు కారు కొనుగోలు చేసేటప్పుడు ఎంత GST చెల్లిస్తారో మీరు గమనించి ఉండకపోవచ్చు. సాధారణంగా.. ఒక్క కారు అమ్మడం వల్ల ప్రభుత్వానికి దాదాపు 42 శాతం పన్ను ఆధాయం వస్తుంది. అంటే.. ఎన్ని ఎక్కువ కార్లు అమ్మితే ప్రభుత్వానికి అంత ఆదాయం వస్తుంది. ఇదే సమయంలో ఎకానమీలో సరఫరా గొలుసు అమలు, ఉపాధి కల్పన కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమనానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందువల్లనే ప్రభుత్వం కారు రుణాలను కూడా ప్రోత్సహిస్తుంది. ఇలా కార్లు, బైక్ లు, వాహనాలు ఎక్కువగా అమ్మకాలు జరుగుతుంటాయి. ఇందులోనూ సదరు బ్యాంక్ లేదా ఫైనాన్స్ సంస్థకు రిస్క్ తక్కువ. ఎందుకంటే లోన్ పూర్తిగా చెల్లించేంతవరకు.. సదరు వాహనాన్ని తమ పేరుపై లోన్ అందించిన కంపెనీ హైపోతికేట్(తనఖా లాంటది) చేసుకుంటుంటాయి.


Click it and Unblock the Notifications