భారతదేశంలోని మెట్రో నగరాల్లో ప్రస్తుతం Diet Coke ప్రియులకు ఒక వింతైన పరిస్థితి ఎదురవుతోంది. ముంబై, బెంగళూరు, పూణే, అహ్మదాబాద్ వంటి నగరాల్లోని సూపర్ మార్కెట్ షెల్ఫ్ లు ఖాళీగా కనిపిస్తుండటమే కాకుండా, బ్లింకిట్, జెప్టో వంటి క్విక్-కామర్స్ యాప్‌లలో కూడా 'అవుట్ ఆఫ్ స్టాక్' అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి.
ప్రస్తుతం మార్కెట్‌లో డైట్ కోక్, కోక్ జీరో వంటి పానీయాల లభ్యత తగ్గడం వెనుక కేవలం స్థానిక సరఫరా సమస్య మాత్రమే లేదు.. దీని వెనుక అంతర్జాతీయ స్థాయి ఇంధన, పారిశ్రామిక సంక్షోభం దాగి ఉంది. ఇది కేవలం ఒక చిన్న సరఫరా సమస్య మాత్రమే కాదు.. దీని వెనుక అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ప్రభుత్వ నిబంధనలు, మారుతున్న వినియోగదారుల అలవాట్లు వంటి అనేక కారణాలు ముడిపడి ఉన్నాయి.

ఈ కొరతకు ప్రధాన కారణం అల్యూమినియం డబ్బాల (క్యాన్స్) లభ్యత తగ్గడమే అని ప్రధానం చెప్పుకోవచ్చు. భారత ప్రభుత్వం నాణ్యతా ప్రమాణాలను పెంచే ఉద్దేశంతో ఏప్రిల్ 2025 నుండి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) కింద క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ (QCO)ను అమలులోకి తెచ్చింది. దీనివల్ల దేశీయంగా తయారయ్యే, విదేశాల నుండి దిగుమతి అయ్యే అల్యూమినియం డబ్బాలకు కఠినమైన ధృవీకరణ తప్పనిసరి అయింది.
ఈ ధృవీకరణ ప్రక్రియలో జాప్యం జరగడం వల్ల ఉత్పత్తి వేగం తగ్గి, మార్కెట్లోకి రావాల్సిన స్టాక్ నిలిచిపోయింది. దీనికి తోడు పశ్చిమ ఆసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు నౌకా రవాణా మార్గాలను దెబ్బతీశాయి. ఫలితంగా ముడి పదార్థాల దిగుమతి ఖర్చు పెరగడమే కాకుండా, రవాణా సమయం కూడా ఎక్కువైంది.
భారతదేశంలోని రెండు అతిపెద్ద క్యాన్ తయారీ సంస్థల్లో ఉత్పత్తి మార్గాలను నిలిపివేయడం వల్ల దేశం యొక్క మొత్తం అల్యూమినియం క్యాన్ ఉత్పత్తి సామర్థ్యంలో దాదాపు 50% నుండి 60% వరకు కోత పడింది. దీనివల్ల వేసవి కాలంలో ఈ పానీయాల కొరత మరింత తీవ్రమయ్యే ప్రమాదం కనిపిస్తోంది.ఈ సంక్షోభానికి ప్రాథమిక కారణం ఎల్పీజీ (LPG) సరఫరాలో ఏర్పడిన తీవ్ర అంతరాయం కూడా ఉంది. అల్యూమినియం డబ్బాలను తయారు చేసే కర్మాగారాల్లోని కొలిమిలకు ఎల్పీజీ కీలకమైన ఇంధనం.
అయితే ఈ ఇంధన కొరతకు పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధ వాతావరణంతో నేరుగా సంబంధం ఉంది. మార్చి 28న ఇరాన్ జరిపిన డ్రోన్, క్షిపణి దాడుల వల్ల ప్రపంచంలోనే అతిపెద్ద అల్యూమినియం ఉత్పత్తి కేంద్రాలైన ఎమిరేట్స్ గ్లోబల్ అల్యూమినియం (అబుదాబి), బహ్రెయిన్ ప్లాంట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఒక్క అబుదాబి ప్లాంటే ఏడాదికి 1.6 మిలియన్ టన్నుల అల్యూమినియంను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్లాంట్లు తిరిగి సాధారణ స్థితికి రావడానికి దాదాపు 12 నెలల సమయం పట్టవచ్చని అంచనా.
ఈ అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల ప్రపంచవ్యాప్తంగా అల్యూమినియం ధరలు అమాంతం పెరిగాయి. గత కొద్ది రోజుల్లోనే ధరలు 15 శాతం మేర పెరిగి, టన్నుకు 3,500 డాలర్ల వద్ద నాలుగేళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. భారతదేశం తన 330 ml సాఫ్ట్ డ్రింక్ క్యాన్‌ల అవసరాల్లో దాదాపు 20 శాతం దిగుమతులపైనే ఆధారపడుతుంది, ఇందులో ఎక్కువ భాగం యూఏఈ (UAE) నుండి వస్తుంది. ఇప్పుడు ఆ సరఫరా మార్గాలు యుద్ధ ప్రాంతాల గుండా ఉండటం వల్ల దిగుమతులు నిలిచిపోయాయి. దీనికి తోడు దేశీయంగా ఉత్పత్తి తగ్గడం పరిశ్రమను కోలుకోలేని దెబ్బ తీసింది.
మరోవైపు భారతీయ పట్టణ యువతలో డబ్బా పానీయాలకు (Canned beverages) డిమాండ్ అసాధారణంగా పెరిగింది. ప్రీమియం ప్యాకేజింగ్, వాడుకలో సౌలభ్యం కారణంగా వినియోగదారులు బాటిల్స్ కంటే క్యాన్‌లకే మొగ్గు చూపుతున్నారు. వేసవి కాలం కావడంతో ఈ డిమాండ్ పరాకాష్టకు చేరింది.
అయితే, సరఫరా గొలుసులో ఉన్న అడ్డంకుల వల్ల ఈ పెరిగిన డిమాండ్‌ను కంపెనీలు అందుకోలేకపోతున్నాయి. ఫలితంగా మార్కెట్లో అసమతుల్యత ఏర్పడి, కేవలం డైట్ కోక్ మాత్రమే కాకుండా అనేక రకాల శీతల పానీయాలు, బీర్ బ్రాండ్లు కూడా ప్యాకేజింగ్ కొరతను ఎదుర్కొంటున్నాయి. బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం 2025లో బీర్ పరిశ్రమ దాదాపు 130 మిలియన్ల క్యాన్‌ల కొరతను ఎదుర్కొంది.
ప్రస్తుతానికి కొన్ని ప్రాంతాల్లో సరఫరా వ్యవస్థలు నెమ్మదిగా గాడిలో పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ, సమస్య పూర్తిగా సమసిపోలేదు. ముడిసరుకుల ధరలు, రవాణా ఖర్చులు పెరగడం వల్ల భవిష్యత్తులో ఈ పానీయాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఏదేమైనా 2026 వేసవిలో భారతీయ పానీయాల పరిశ్రమ ముప్పేట దాడిని ఎదుర్కొంటోంది.
ఒకవైపు దేశీయ ఉత్పత్తిలో సగానికి పైగా క్షీణత, మరోవైపు దిగుమతులకు ఆటంకాలు, వీటన్నింటికీ తోడు ముడి పదార్థాల ధరల పెరుగుదల. కోకా-కోలా, పెప్సికో, వరుణ్ బెవరేజెస్ వంటి దిగ్గజ సంస్థలు ఈ సరఫరా గొలుసు అంతరాయం వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. కాబట్టి, వినియోగదారులు తమకు ఇష్టమైన క్యాన్ పానీయాలు దొరకకపోవడానికి వెనుక ఉన్నది కేవలం షాపు యజమాని సమస్య కాదు, ఇది ఒక అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ సంక్షోభం అని అర్థం చేసుకోవాలి.


Click it and Unblock the Notifications
