బంగారంతో అమెరికాను టార్గెట్ చేసిన ప్రపంచదేశాలు.. డాలర్ విలువ కుప్పకూల్చేలా బిగ్ స్కెచ్..
ప్రపంచవ్యాప్తంగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ఆర్థిక అనిశ్చితుల నడుమ అంతర్జాతీయ బంగారం ధరలు అపూర్వమైన స్థాయికి చేరుకోవడంలో ప్రపంచ కేంద్ర బ్యాంకులు అత్యంత కీలక పాత్ర పోషించాయి. 2022 అక్టోబర్ మధ్యకాలం నుండి చూస్తే, గడిచిన నాలుగేళ్ల కాలంలో Gold ధర ఔన్సుకు $1,646 డాలర్ల నుండి 164 శాతం పెరిగి $4,346 డాలర్ల మార్కును దాటింది. 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమవ్వడం, దానికి తోడు ఇజ్రాయెల్, చైనా, తైవాన్ ప్రాంతాలలో పెరిగిన ఉద్రిక్తతలు కేంద్ర బ్యాంకులను తమ వద్ద ఉన్న బంగారు నిల్వలను విపరీతంగా పెంచుకోవడానికి పురికొల్పాయి.
ముఖ్యంగా 2023లో రష్యాకు చెందిన సుమారు 300 బిలియన్ డాలర్ల విలువైన విదేశీ మారక ఆస్తులు, బంగారాన్ని అమెరికా, దాని మిత్రదేశాలు స్తంభింపజేయడం (ఫ్రీజ్ చేయడం) ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ప్రభుత్వాలలో తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది. ఈ పరిణామాల తదుపరి కేంద్ర బ్యాంకులు తమ విదేశీ మారక నిల్వలను కాపాడుకునేందుకు బంగారాన్ని ప్రధాన సురక్షిత సాధనంగా ఎంచుకున్నాయి.

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) నివేదికల ప్రకారం.. గతంలో కేంద్ర బ్యాంకులు సంవత్సరానికి సగటున 500 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయగా, 2022 నుండి ఈ వేగం ఊహించని రీతిలో పెరిగింది. 2022లో 1,082 టన్నులు, 2023లో 1,037 టన్నులు మరియు 2024లో రికార్డు స్థాయిలో 1,092 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసిన బ్యాంకులు, 2025లో 863.3 టన్నులను సేకరించాయి. ఇక 2026 మొదటి అర్ధభాగంలో ఇప్పటివరకు మరో 345 టన్నులను తమ నిల్వలకు జోడించాయి.
ఈ నిరంతర కొనుగోళ్ల ఫలితంగా ఈ ఏడాది జనవరి 29న Gold ధర సర్వకాలిక గరిష్ఠ స్థాయి అయిన $5,602 డాలర్లను తాకింది. ఆ తర్వాత గరిష్ఠ స్థాయి నుండి 22 శాతం వరకు ధర పడిపోయినప్పటికీ, అంతర్జాతీయంగా విస్తరిస్తున్న ఇరాన్ సంక్షోభం, చమురు ధరల హెచ్చుతగ్గులు, యూఎస్ ద్రవ్యోల్బణ గణాంకాల అస్థిరత కారణంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. WGC నిర్వహించిన 2026 సర్వే ప్రకారం 89 శాతం మంది సెంట్రల్ బ్యాంకర్లు వచ్చే ఏడాది ప్రపంచ నిల్వలు మరిన్ని పెరుగుతాయని, 45 శాతం మంది తమ సొంత బ్యాంకుల బంగారు నిల్వలను పెంచుకోనున్నామని స్పష్టం చేశారు.
కేవలం కొనుగోలు చేయడం మాత్రమే కాకుండా, అనేక దేశాలు తమ బంగారాన్ని అమెరికా, ఇతర విదేశీ ఖజానాల నుండి స్వదేశానికి లేదా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుండటం గమనార్హం. ఉదాహరణకు, డచ్ సెంట్రల్ బ్యాంక్ (DNB) తన వద్ద ఉన్న 612.4 టన్నుల నిల్వల నుండి మార్చి, ఆగస్టు 2026 మధ్య సుమారు 86 టన్నుల బంగారాన్ని అమెరికా, కెనడాల నుండి లండన్ మార్కెట్‌కు తరలించింది. ఫ్రాన్స్ కూడా తన ఆస్తులను అమెరికా నుండి వెనక్కి తీసుకెళ్లగా.. భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) 2024లోనే యుకే నుండి దాదాపు 200 మెట్రిక్ టన్నుల బంగారాన్ని భారత్‌కు రప్పించింది. దీనితో మార్చి 31, 2026 నాటికి ఆర్‌బిఐ వద్ద ఉన్న మొత్తం బంగారు నిల్వలు 880.52 టన్నులకు చేరుకున్నాయి.
1996 తర్వాత తొలిసారిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అధికారిక విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా 27 శాతానికి చేరి యూఎస్ ట్రెజరీలు (22%), యూరో (15%) ఆస్తులను దాటి అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఐఎంఎఫ్ (IMF) ప్రచురించిన COFER డేటా ప్రకారం 2026 మొదటి త్రైమాసికంలో డాలర్ నిల్వలు 57.13 శాతానికి పెరిగాయి. కాబట్టి ఇది డాలర్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించడం (డీ-డాలరైజేషన్) కాదని.. పెరిగిన బంగారం విలువల వల్ల సంభవించిన వైవిధ్యీకరణ (డైవర్సిఫికేషన్) వ్యూహమని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications
