Onion Prices: నాలుగు రోజుల్లో రెండితలైన ఉల్లి ధర.. తర్వలో కేజీ రూ.150 అవ్వొచ్చు..!
ఉల్లి ధరలు: కొన్ని నెలల కిందట సామాన్యులను హడలెత్తించిన టమాట రేటును ప్రజలు ఇంకా మర్చిపోక ముందు తాజాగా ఉల్లి ధరలు సామాన్యులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో ప్రస్తుతం కేజీ ఉల్లి ధర దాదాపు రూ.80 నుంచి రూ.100 మధ్యకు చేరుకుంది. దీనికి తోడు 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇది రాజకీయ అస్ర్తంగా మారిపోయింది. అధికార పార్టీలు సైతం వీటిపై ఆందోళనకు దిగటంపై ప్రతిపక్షాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. గతవారం రిటైల్ మార్కెట్‌లో కిలో ఉల్లి రూ.30 నుంచి రూ.40కి లభించగా, రెండు రోజుల క్రితమే కిలో రూ.80-100కి పెరగటం సామాన్యులకు షాక్ ఇస్తోంది.

కొందరు నిపుణులు మాత్రం ఉల్లిని భారీగా నిల్వ చేయటమే సరఫరా తగ్గటానికి కారణంగా చెబుతున్నారు. మార్కెట్లోకి చివరిగా వచ్చిన ఉల్లిని ప్రజలు నిల్వచేస్తున్నారని లూధియానా మార్కెట్ ప్రెసిడెంట్ రిషు అరోరా అభిప్రాయపడ్డారు. దీన్ని నియంత్రించేందుకు ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోకపోతే రానున్నా కాలంలో కేజీ ఉల్లి ధర రూ.120 నుంచి రూ.150కి చేరుకునే అవకాశం ఉందని అన్నారు. ఇప్పటికే కొన్ని నగరాల్లో రిటైల్ ఉల్లి విక్రయ ధర కేజీకి రూ.80 నుంచి రూ.100 మధ్యకు చేరుకుంది.
దీపావళి తర్వాత లేదా నవంబర్ చివరి వారంలో మార్కెట్లోకి కొత్త ఉల్లి పంట వస్తుందని హోల్ సేల్ వ్యాపారులు చెబుతున్నారు. దీని ప్రకారం దాదాపు నెల రోజుల పాటు ప్రజలు ధరల భారాన్ని తప్పక మోయాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతికి మెట్రిక్ టన్ను ధరను 800 డాలర్లుగా నిర్ణయించింది. ఈ ధరలు డిసెంబర్ 31, 2023 వరకు అమలులో ఉంటాయని వెల్లడించింది. రబీ పంట నిల్వలు తగ్గుముఖం పట్టడం, తాజాగా ఖరీఫ్ పంట రాక ఆలస్యం కావడంతో ఉల్లి ధరలు గత రెండు వారాలుగా గణనీయంగా పెరిగాయి. అలాగే ఖరీఫ్ సీజన్‌లోనూ ఉల్లి ఉత్పత్తి తగ్గినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications