న్యూఢిల్లీ: హోల్‌సేల్ ద్రవ్యోల్బణానికి సంబంధించిన వివరాలను కేంద్ర ప్రభుత్వం కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది. ఇందులో స్వల్పంగా తగ్గుదల కనిపించింది. హోల్‌సేల్ ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుతోందని తెలిపింది. 2011-12న రికార్డు చేసిన హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ (డబ్ల్యూపీఐ) ఆధారంగా దీన్ని లెక్కించినట్లు పేర్కొంది. డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) ఆధీనంలోని ఆర్థిక సలహాదారు కార్యాలయం ఈ ప్రకటను విడుదల చేసింది.
ప్రతి నెల 14వ తదీ లేదా ఆ మరుసటి రోజున డీపీఐఐటీ హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ గణాంకాలను విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోంది. గత సంవత్సరం నవంబర్, డిసెంబర్ నెలల కాలంతో పోల్చుకుంటే- ఈ సంవత్సరం జనవరిలో హోల్‌సేల్ ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. గత ఏడాది నవంబర్‌లో హోల్‌సేల్ ద్రవ్యోల్బణం 14.87 శాతం నమోదైంది. ఆ మరుసటి నెల అంటే డిసెంబర్‌లో ఇది తగ్గింది. 13.56 శాతానికి చేరింది.

జనవరిలో ఈ సంఖ్య మరింతగా పడిపోయింది. 12.96 శాతానికి చేరింది. నవంబర్ నుంచి ఇది తగ్గుతూ వస్తోందని, ఇదే పరిస్థితి మున్ముందు కొనసాగే అవకాశాలు లేకపోలేదని డీపీఐఐటీ అంచనా వేసింది. మినరల్ ఆయిల్, క్రూడ్ పెట్రోలియం, నేచురల్ గ్యాస్, బేసిక్ మెటల్స్, కెమికల్స్, కెమికల్ ప్రొడక్ట్స్ ధరల్లో చోటు చేసుకున్న పెరుగుదల వల్ల జనవరిలో హోల్‌సేల్ ద్రవ్యోల్బణం 12.96 శాతానికి పడిపోయినట్లు డీపీఐఐటీ వివరించింది.
2021 నవంబర్, డిసెంబర్‌లో అన్ని రకాల నిత్యావసర సరుకులకు సంబంధించిన డబ్ల్యూపీఐ 143.7, 142.4 శాతంగా నమోదైంది. ఈ సంవత్సరం జనవరిలో ఈ సంఖ్య 142.9గా నమోదైంది. ఇదే మూడు నెలల కాలానికి చెందిన ద్రవ్యోల్బణం 14.87, 13.56 కాగా.. జనవరిలో ఇది 12.96గా రికార్డయింది. ప్రైమరీ ఆర్టికల్స్ కేటగిరీలో నవంబర్, డిసెంబర్ నెలల్లో డబ్ల్యూపీఐ 168.4, 167.8గా రికార్డయింది. జనవరిలో ఈ సంఖ్య 165. అదే కాలానికి ద్రవ్యోల్బణం 10.21, 13.38 కాగా.. జనవరికి అది 13.87గా నమోదైంది.


Click it and Unblock the Notifications