Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..
అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పుడు ఒక మెయిల్ సంచలనం సృష్టిస్తోంది. దేశ రహస్యాలను అడ్డం పెట్టుకుని ఆర్థిక మార్కెట్లలో లాభాలు గడించవద్దంటూ వైట్ హౌస్ తన సిబ్బందికి గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఇరాన్ యుద్ధం , వెనిజులా పరిణామాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు బయటకు రాకముందే, కొందరు ట్రేడింగ్ (Trading ) ద్వారా భారీగా లాభపడుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆ 15 నిమిషాల మిస్టరీ ఏంటి?
మార్చి 23న జరిగిన ఒక సంఘటన ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇరాన్ పవర్ ప్లాంట్లపై దాడి చేస్తానన్న తన హెచ్చరికపై ఐదు రోజుల విరామం ప్రకటిస్తున్నట్లు ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే, ఈ పోస్ట్ పడటానికి సరిగ్గా 15 నిమిషాల ముందే మార్కెట్‌లో బిలియన్ల డాలర్ల విలువైన ఆయిల్ ఫ్యూచర్స్ చేతులు మారాయి. ట్రంప్ పోస్ట్ తర్వాత ఆయిల్ ధరలు ఒక్కసారిగా పడిపోయి, స్టాక్ మార్కెట్లు లాభాల్లోకి వెళ్లాయి. ఈ నిర్ణయం ముందే తెలిసిన కొందరు వ్యక్తులు భారీగా అమ్మకాలు జరిపి కోట్లు సంపాదించారని డేటా చెబుతోంది.
ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఏమిటి?
ప్రభుత్వంలోని కీలక పదవుల్లో ఉన్నవారు లేదా సిబ్బందికి మాత్రమే తెలిసే రహస్య సమాచారాన్ని (Non-public information) ఉపయోగించి స్టాక్ మార్కెట్ లేదా ఇతర బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లలో డబ్బు సంపాదించడాన్ని ఇన్‌సైడర్ ట్రేడింగ్ (Insider Trading) అంటారు. ఇది చట్టవిరుద్ధం. వైట్ హౌస్ మేనేజ్మెంట్ ఆఫీస్ పంపిన ఇమెయిల్‌లో ఇలాంటి రహస్య సమాచారాన్ని వ్యక్తిగత లాభాల కోసం వాడకూడదని స్పష్టంగా హెచ్చరించింది.
బెట్టింగ్ మార్కెట్లలో కలకలం
కేవలం స్టాక్ మార్కెట్లే కాదు, ఇప్పుడు 'పాలిమార్కెట్' (Polymarket) వంటి ఆన్‌లైన్ ప్రిడిక్షన్ మార్కెట్లలో కూడా వింతైన ట్రేడింగ్ కనిపిస్తోంది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంపై కొత్తగా క్రియేట్ అయిన కొన్ని అజ్ఞాత అకౌంట్లు, కచ్చితమైన సమయంలో బెట్టింగ్‌లు కాసి లక్షల డాలర్ల ప్రాఫిట్ పొందాయి. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో పట్టుబడటానికి ముందే జరిగిన కొన్ని బెట్లు కూడా ఇప్పుడు అనుమానాలకు తావిస్తున్నాయి.
నిబంధనలు ఏం చెబుతున్నాయి?
ఫెడరల్ ఉద్యోగులు ప్రభుత్వ ఆస్తుల మీద ఉండి జూదం ఆడటం నిషిద్ధం. అలాగే నైతిక నియమావళి (Ethics rules) ప్రకారం ప్రభుత్వ సమాచారాన్ని సొంతానికి వాడుకోకూడదు. వైట్ హౌస్ ప్రతినిధి డేవిస్ ఇంగిల్ మాట్లాడుతూ.. "అధ్యక్షుడు ట్రంప్ చాలా స్పష్టంగా ఉన్నారు. అందరికీ లాభదాయకమైన మార్కెట్ ఉండాలని ఆయన కోరుకుంటారు. కానీ ప్రభుత్వ అధికారులు రహస్య సమాచారంతో లబ్ధి పొందడాన్ని ఆయన అస్సలు సహించరు" అని పేర్కొన్నారు. ఏది ఏమైనా, యుద్ధం లాంటి కీలక సమయాల్లో ఇలాంటి ట్రేడింగ్ (Trading) అక్రమాలు వెలుగు చూడటం ప్రపంచ మార్కెట్లలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఏ దేశానికైనా ఆర్థిక సుస్థిరత అనేది ఆ దేశ పాలకులు తీసుకునే నిర్ణయాల పారదర్శకతపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా యుద్ధం వంటి క్లిష్ట పరిస్థితుల్లో సామాన్య ఇన్వెస్టర్లు భయంతో వణికిపోతుంటే, కొందరు ప్రభుత్వంలోని లూప్‌హోల్స్‌ను ఉపయోగించుకుని ట్రేడింగ్ ద్వారా భారీగా లాభపడటం అనేది నైతికం అలాగే నేరం కూడా. వైట్ హౌస్ పంపిన ఈ హెచ్చరిక మెయిల్, ప్రిడిక్షన్ మార్కెట్లలో పెరిగిపోతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు కూడా కేవలం ఊహాగానాలను నమ్మి ట్రేడింగ్ చేయకుండా, మార్కెట్ గమనాన్ని గమనిస్తూ జాగ్రత్తగా అడుగులు వేయడం అవసరం.


Click it and Unblock the Notifications