What3Words: ఎప్పుడైనా తెలియని ప్రదేశానికి వెళ్లాలంటే దారి కనుక్కోవడానికి గతంలో చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. గూగుల్ తల్లి పుణ్యమా అని ఇప్పుడైతే మ్యాప్స్ ద్వారా వెళ్లిపోతున్నాం. అయితే కొన్నిసార్లు గూగుల్ మ్యాప్స్ సైతం తప్పుగా లొకేషన్ చూపించిన సందర్భాలూ ఉన్నాయి. ఖచ్చితమైన లొకేషన్ గుర్తించడానికి ఈ యాప్ ఓ సొల్యూషన్ అని చెప్పవచ్చు.
'What3Words' అనేది ఒక నావిగేషన్ యాప్. పేరు వినడానికి కొత్తగా అనిపించినా దీని పనితీరు మాత్రం అత్యద్భుతమనే చెప్పాలి. ఎంతలా అంటే రానున్న రోజుల్లో గూగుల్ మ్యాప్స్ కు ఇది పోటీ కావచ్చని భావిస్తున్నారు. ఈ UK ఆధారిత యాప్ ను వినియోగించడం కూడా చాలా సులువు. పేరుకి తగినట్లుగానే ఇందులో ప్రతి లొకేషన్ ౩ పదాల ద్వారా గుర్తించబడుతుంది. వీటితో GPS కో ఆర్డినేట్లను ట్యాగ్ చేస్తుంది.

మన దేశంలోని పలు పిన్ కోడ్స్ కిందనున్న చిరునామాలను What3Wordsలో స్లాట్ చేశారు. తద్వారా ఖచ్చితమైన గమ్యస్థానానికి చేరేందుకు ఇది సహాయం చేస్తుంది. హిందీ, మరాఠీ, తమిళం, తెలుగు, బెంగాలీ, కన్నడ, నేపాలీ, ఉర్దూ, గుజరాతీ, మలయాళం, పంజాబీ మరియు ఒడియా వంటి భారతీయ భాషల్లో ఈ యాప్ సేవలు పొందవచ్చు.
వినియోగదారులకు మరింత మెరుగైన, ఖచ్చితమైన నావిగేషన్ సేవలు అందించడమే తమ లక్ష్యమని What3Words CEO క్రిస్ షెల్డ్రిక్ తెలిపారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న మ్యాపింగ్ సిస్టమ్ కు ఈ యాప్ మరొక అదనపు లేయర్ గా పనిచేస్తుందని చెప్పారు. బ్లూడార్ట్, DTDC వంటి కొరియర్ కంపెనీలకు What3Words సేవలందిస్తోంది. ఇవేకాకా టాటా మోటార్స్, మహీంద్రా వంటి కార్ బ్రాండ్స్ తోనూ భాగస్వామ్యం కలిగి ఉంది.


Click it and Unblock the Notifications