Gold: ల్యాబ్‌లో తయారయ్యే బంగారం గురించి తెలుసా? అసలు బంగారానికి దీనికి తేడా ఏంటి?
ఇప్పటివరకు మనం ల్యాబ్-గ్రోన్ డైమండ్స్ (ప్రయోగశాలలో తయారైన వజ్రాలు) గురించి విన్నాం. ఇప్పుడు అదే బాటలోకి బంగారం (Gold) కూడా వచ్చేసింది. సాధారణంగా బంగారం అంటే గనుల నుండి వెలికితీసేదే అని మనందరికీ తెలుసు. కానీ, సైన్స్ పెరిగిన కొద్దీ భూమిలోంచి తీసే పని లేకుండానే.. ప్రయోగశాలల్లో బంగారాన్ని తయారు చేస్తున్నారు. మన భారతీయులకు బంగారంతో ఒక విడదీయలేని భావోద్వేగ బంధం ఉంది. మరి ఈ కొత్త తరహా బంగారం మన సంప్రదాయాలకు, నమ్మకాలకు సరిపోతుందా? దీని వెనుక ఉన్న అసలు రహస్యాలేంటో ఇప్పుడు చూద్దాం.

ల్యాబ్-గ్రోన్ గోల్డ్ అంటే ఏమిటి?
చాలామందికి వచ్చే మొదటి అనుమానం.. ఇది నకిలీ బంగారమా? అని. కానీ నిపుణుల సమాధానం 'కాదు'. ల్యాబ్-గ్రోన్ గోల్డ్ అనేది ఫిజికల్ గా, కెమికల్ గా గనుల నుంచి తీసిన బంగారంతో 100% సమానంగా ఉంటుంది. ఇది గోల్డ్ కోటింగ్ వేసిన రోల్డ్ గోల్డ్ కాదు. దాని పరమాణు నిర్మాణం (Atomic structure) కూడా అసలు బంగారం లాగే ఉంటుంది. కేవలం అది తయారయ్యే విధానం మాత్రమే వేరు. గనుల నుంచి తీసేది ప్రకృతి సిద్ధంగా భూమి పొరల్లో తయారైతే, ఇది సైంటిస్టుల పర్యవేక్షణలో ల్యాబ్ లో తయారవుతుంది.
ఇది ఎలా తయారవుతుంది?
ప్రస్తుతం దీని తయారీలో రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి అడ్వాన్స్‌డ్ పార్టికల్ టెక్నాలజీని ఉపయోగించి అణువుల స్థాయి నుండి బంగారాన్ని నిర్మించడం. ఇది చాలా ఖరీదైన పద్ధతి. రెండోది రీసైకిల్ చేసిన బంగారాన్ని సేకరించి, అత్యంత అధునాతన శుద్ధీకరణ ప్రక్రియల ద్వారా గరిష్ట స్వచ్ఛతను సాధించడం. నిజానికి, ల్యాబ్-గ్రోన్ డైమండ్స్ మార్కెట్లోకి వచ్చినంత వేగంగా బంగారం (Gold) ఇంకా పూర్తి స్థాయిలో సామాన్యులకు అందుబాటులోకి రాలేదు. కానీ, దీనిపై వేగంగా పరిశోధనలు జరుగుతున్నాయి.
పర్యావరణానికి మేలు చేసే బంగారం
బంగారం వెలికితీత (Mining) అనేది పర్యావరణానికి చాలా హానికరమైన ప్రక్రియ. టన్నుల కొద్దీ మట్టిని తవ్వడం, నీటిని వృధా చేయడం, సైనైడ్ వంటి ప్రమాదకర రసాయనాలను వాడటం వల్ల ప్రకృతి దెబ్బతింటుంది. ఈ క్రమంలో పర్యావరణాన్ని ప్రేమించే నేటి తరం వినియోగదారులు 'సస్టైనబుల్ గోల్డ్' (Sustainable Gold) వైపు మొగ్గు చూపుతున్నారు. ల్యాబ్-గ్రోన్ గోల్డ్ వల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి , ఎకో-ఫ్రెండ్లీగా ఉంటుంది.
రీసేల్ వాల్యూ ఉంటుందా?
పెట్టుబడి విషయానికి వస్తే.. బంగారానికి దాని బరువు, స్వచ్ఛత , అప్పటి మార్కెట్ ధరను బట్టి విలువ ఉంటుంది. ల్యాబ్-గ్రోన్ గోల్డ్ కూడా అదే స్వచ్ఛత ప్రమాణాలను కలిగి ఉంటే.. దానికి కూడా మైనింగ్ గోల్డ్ తరహాలోనే రీసేల్ విలువ ఉంటుంది. అయితే భారత్ వంటి దేశాల్లో 'జియోలాజికల్ రేరిటీ' (అరుదుగా దొరికేది) అనే భావన వల్ల గనుల నుంచి వచ్చే బంగారానికి ఉన్న క్రేజ్ ఇప్పుడప్పుడే తగ్గకపోవచ్చు.
ల్యాబ్-గ్రోన్ గోల్డ్ అనేది భవిష్యత్తులో జ్యువెలరీ రంగంలో ఒక పెద్ద మార్పు కాబోతోంది. ఇది మైనింగ్ గోల్డ్ కు ప్రత్యామ్నాయం కాకపోవచ్చు. కానీ, పర్యావరణ స్పృహ ఉన్నవారికి, టెక్నాలజీని ఇష్టపడేవారికి ఇది ఒక అద్భుతమైన ఎంపిక. దీని పట్ల ప్రజల్లో అవగాహన పెరగడానికి మరికొంత సమయం పట్టవచ్చు.


Click it and Unblock the Notifications