SSY Vs MSSC: సుకన్య సమృద్ధి యోజన, మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్‍లో ఏది బెటర్..!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2023ని ప్రవేశ పెడుతూ మహిళల కోసం ఒక ప్రత్యేక పథకాన్ని ప్రకటించారు. అదే మహిళా సమ్మాన్ బచత్ పత్ర యోజన (మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్). ఈ పథకాన్ని ప్రకటించినప్పటి నుంచి మహిళల్లో దీనిపై ఉత్సాహం నెలకొంది. MSSC కాకుండా, ప్రభుత్వం ఇప్పటికే మహిళల కోసం అనేక ఇతర పథకాలను అమలు చేస్తోంది. వీటిలో ఒకటి సుకన్య సమృద్ధి యోజన. అయితే ఈ రెండు పథకాల మధ్య తేడా ఏమిటి..? ఏ పథకంలో పెట్టుబడి పెట్టడం ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకుందాం.

మహిళా సమ్మాన్ పొదుపు పథకం
మహిళా సమ్మాన్ బచత్ పత్ర యోజన అనేది స్వల్పకాలిక పథకం. దీనిలో మీరు మీ డబ్బును రెండేళ్లపాటు పెట్టుబడి పెట్టవచ్చు. మీరు మార్చి 2023 నుంచి 2025 వరకు ఇందులో పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇందులో వార్షిక ప్రాతిపదికన 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ పథకం FD లాంటిది, దీనిలో మీరు తక్కువ వ్యవధిలో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి వడ్డీని పొందవచ్చు. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడానికి ఎటువంటి వయోపరిమితిని నిర్ణయించలేదు. సో ఇందులో ఏ వయస్సులోనైనా స్త్రీ లేదా బిడ్డ ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. దీనిలో పాక్షికంగా విత్ డ్రా చేసుకునే అవకాశం కూడా ఉంది.

సుకన్య సమృద్ధి యోజన
సుకన్య సమృద్ధి యోజన అనేది దీర్ఘకాలిక పెట్టుబడి పథకం. ఈ పథకం ఆడపిల్లల కోసం ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద, ప్రభుత్వం ఖాతాలో జమ చేసిన మొత్తంపై 7.6 శాతం వడ్డీని అందిస్తారు. ఇందులో ప్రతి సంవత్సరం రూ.250 నుంచి రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఆడపిల్లకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత, ఆమె ఖాతా నుంచి పాక్షికంగా విత్‌డ్రా చేసుకునే అవకాశం కూడా ఉంది. అదే సమయంలో, 21 సంవత్సరాల వయస్సు పూర్తయిన మెచ్యూరిటీ సొమ్ము వస్తుంది.

రెండింటిలో ఏది బెటర్
సుకన్య సమృద్ధి యోజన పథకం ఆడ పిల్లలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వారి చదువుకు, పెళ్లి ఖర్చులకు ఈ డబ్బు ఉపయోగపడుతుంది. ఈ పథకంలో మీరు ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి 15 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఆడపిల్లకి 21 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు మెచ్యూర్డ్ మొత్తాన్ని పొందవచ్చు. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ మహిళలు ఏ వయస్సు వారైనా పెట్టుబడి పెట్టొచ్చు. ఇది స్వల్ప కాలిక పెట్టుబడి. ఇది వృద్ధ మహిళలకు ఉపయోగపడే పథకం. అలాగే తక్కువ కాలం పెట్టుబడి పెట్టే వారికి ఈ పథకం చక్కటి ఎంపిక.


Click it and Unblock the Notifications