Indian Enonomy: బడ్జెట్ ముందు.. ఆర్థిక వృద్ధి గురించి ప్రభుత్వ అంచనాలు ఇవే..!
Economic Growth: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కేవలం ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. ఈ క్రమంలో వృద్ధి అంచనాలపై కీలక చర్చ కొనసాగుతోంది.
భారతదేశ ఆర్థిక వ్యవస్థ 2024-25 ఆర్థిక సంవత్సరంలో 7% వృద్ధి చెందుతుందని అంచనా వేయబడింది. అయితే దీనికి ముందు 2023-24లో అంచనా వేసిన 7.3%గా ఉంది. తాజా వృద్ధి అంచనా వివరాలను కేంద్ర ప్రభుత్వం సోమవారం సమీక్షలో ప్రకటించింది. దేశంలో బలమైన డిమాండ్ కనిపిస్తోందని అలాగే ప్రైవేట్ వినియోగం, పెట్టుబడులతో పాటు గడచిన పదేళ్లుగా మోదీ సర్కార్ అమలు చేసిన సంస్కరణల గురించి సమీక్షలో ప్రస్తావించబడింది.

ఈ వేసవిలో దేశం సాధారణ ఎన్నికలకు వెళ్లడానికి ముందు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం తన చివరి బడ్జెట్‌ను సమర్పించడానికి ముందు తాజా వృద్ధి అంచనాలు వచ్చాయి. ప్రభుత్వం మొదటి ముందస్తు అంచనాల ప్రకారం.. 2022-23లో 7.2%, 2021-22లో 8.7% వృద్ధి, అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ 7.3% రేటుతో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా కొనసాగుతోందని గణాంకాలు చెబుతున్నాయి.
ఇదే క్రమంలో రేటింగ్ సంస్థల అంచనాలను పరిశీలిస్తే.. S&P గ్లోబల్ రేటింగ్స్ ప్రకారం భారత్ రానున్న మూడేళ్లలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని పేర్కొంది. అలాగే 2030 నాటికి జపాన్, జర్మనీలను అధిగమించి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించగలదని అంచనా వేసింది. ఈ క్రమంలోనే బడ్జెట్ కి ముందర భారత స్టాక్ మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తున్నాయి. సోమవారం రోజున బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 1240 పాయింట్ల, నిఫ్టీ 385 పాయింట్ల మేర లాభాలపడి బుల్ ర్యాలీకి ఆజ్యం పోశాయి.


Click it and Unblock the Notifications