అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి జోబిడెన్ విజయం సాధించారు. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కేవలం 214 ఎలక్టోరల్ వోట్లు రాగా, బిడెన్‌కు 290 వచ్చాయి. బిడెన్ 50.60 శాతంతో 75,264,567 ఓట్లు పొందగా, ట్రంప్ 47.73 శాతంతో 70,993,368 ఓట్లు పొందారు. డెమోక్రటిక్ నేత గెలుపు భారతీయ కంపెనీలకు, దేశీయ ఫైనాన్షియల్ మార్కెట్లకు శుభవార్త అని మార్కెట్ నిపుణులు అంటున్నారు. బిడెన్ (77) అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కమలా హారిస్ (56) వైస్ ప్రెసిడెంట్‌గా గెలిచారు.

సంబంధాలు మరింత బలపడొచ్చు
బిడెన్ గెలుపు భారత మార్కెట్లకు లాభమేనని, ఆయన రక్షణాత్మక ధోరణితో ఉండరని, అది దోహదపడుతుందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. అమెరికా-భారత్ మధ్య సంబంధాలు కూడా మరింతగా బలపడతాయని భావిస్తున్నారు. అమెరికా-చైనా మధ్య సంబంధాలు అంత సానుకూలంగా లేవని, ఇవి కూడా మనకు అనుకూలమేనని అంటున్నారు. అయితే జోబిడెన్ తీరుపై ఇది ఆధారపడి ఉంటుందని మరికొంతమంది చెబుతున్నారు. భారత్‌కు చాలా సానుకూల అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. బిడెన్ ఎక్కువగా నాన్-వైట్ కమ్యూనిటీ నుండి ఓట్లు పొందారు. ఆయన భారత్‌కు అమెరికాను మరింత ప్రాధాన్యత కలిగిన భాగస్వామిగా చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఇమ్మిగ్రేషన్ పాలసీ, ఐటీ రంగానికి సానుకూలం
బరాక్ ఒబామా సమయంలో వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నిక కావడానికి ముందు జోబిడెన్ మాట్లాడుతూ భారత్‌తో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇరుదేశాల మధ్య బలమైన సంబంధాలు ఉండాలన్నారు. ఇమ్మిగ్రేషన్ పాలసీ అంశానికి సంబంధించి కూడా సానుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ట్రంప్ హయాంలో ఐటీ రంగానికి సంబంధించిన పలు వీసా కఠిన నిబంధనలు, జోబిడెన్ హయాంలో సమసిపోవచ్చునని పీఎంఎస్ సీఈవో అజయ్ బోడ్కే అన్నారు.

అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు పెట్టుబడులు
అదే సమయంలో ఆందోళనలు కూడా లేకపోలేదని మరికొందరు అంటున్నారు. కీలకమైన ఫార్మా ఉత్పత్తులు అమెరికాలో తయారవుతాయని, అది ఎలా ఉంటుందో చూడాలని అంటున్నారు. ఇదిలా ఉండగా, అమెరికాలో పన్ను రేటు పెంపు, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు పెట్టుబడులు పెరగవచ్చునని భావిస్తున్నారు. డెమోక్రాట్ల అనూహ్య విజయం కార్పోరేట్ పన్ను, సంపన్నులపై పన్ను, కఠినమైన పర్యావరణ నిబంధనలు, బ్యాంకులు, ఇంధనం, మైనింగ్, హెల్త్ ప్రొటెక్షన్, టెక్నాలజీ పర్యవేక్షణను విస్తృతంగా పెంచే విధానాలకు దారితీసే అవకాశాలు ఉందని చెబుతున్నారు


Click it and Unblock the Notifications