ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు బిగ్ షాక్..కొంపలు ముంచబోతున్న ఇరాన్ యుద్ధం.. రికార్డు స్థాయికి ధరలు..
అమెరికా, ఇరాన్‌ల మధ్య రోజురోజుకూ తీవ్రమవుతున్న సైనిక ఉద్రిక్తతలు ఈ ఏడాది ఏప్రిల్‌లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి ఇప్పటివరకు ఎదురైన అత్యంత పెద్ద సవాలుగా నిలిచాయి. ఇరు దేశాల మధ్య ఘర్షణలు మరింత ముదిరి, పరిస్థితి చేదాటిపోతుందనే భయాల నడుమ అంతర్జాతీయంగా చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
ప్రముఖ అంతర్జాతీయ ఇంధన పరిశోధన సంస్థ 'రిస్టాడ్ ఎనర్జీ' తన తాజా నివేదికలో ఒకవేళ అమెరికా-ఇరాన్‌ల మధ్య తిరిగి పూర్తిస్థాయి సాయుధ ఘర్షణ ప్రారంభమైతే ముడి చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో ఏకంగా బ్యారెల్‌కు 150 డాలర్ల రికార్డు స్థాయికి చేరుకోవచ్చని హెచ్చరించింది. ఈ భయాందోళనలే ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లను కుదిపేస్తూ వాటిపై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతున్నాయి.

ఈ యుద్ధ వాతావరణం వల్ల గల్ఫ్ ప్రాంతంలోని ఆరు ప్రధాన చమురు ఉత్పాదక దేశాలలో రోజుకు సుమారు 11.8 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడింది. ఆధునిక ప్రపంచ చరిత్రలోనే చమురు సరఫరా వ్యవస్థకు తగిలిన అతిపెద్ద దెబ్బగా దీనిని రిస్టాడ్ అభివర్ణించింది. ప్రస్తుత ఉద్రిక్తతలు చివరకు పూర్తిస్థాయి యుద్ధానికి దారితీస్తాయా లేదా ఇంకా నియంత్రించగలిగే పరిధిలోనే ఉన్నాయా అని ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుందని రిస్టాడ్ ఎనర్జీ జియోపొలిటికల్ అఫైర్స్ హెడ్ జార్జ్ లయన్ విశ్లేషించారు.
ఈ తీవ్ర అనిశ్చిత పరిస్థితి మార్కెట్లో స్పష్టంగా ప్రతిబింబిస్తోందని, దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒకానొక దశలో బ్యారెల్‌కు 94.5 డాలర్లకు ఎగబాకి, ఆ తర్వాత స్వల్పంగా తగ్గి బ్యారెల్‌కు 93 డాలర్ల వద్ద స్థిరపడిందని ఆయన పేర్కొన్నారు.
అయితే ప్రస్తుతానికి చమురు మార్కెట్ పూర్తిగా అదుపు తప్పకుండా , ధరలు మరింత దిగజారకుండా కొన్ని అంశాలు నిరోధిస్తున్నాయి. మొదటిది, యునైటెడ్ స్టేట్స్ తన వ్యూహాత్మక చమురు నిల్వల నుండి రికార్డు స్థాయిలో ముడి చమురును మార్కెట్లోకి విడుదల చేస్తూ సరఫరా కొరతను భర్తీ చేస్తోంది.
రెండవది, ప్రపంచంలోనే అతిపెద్ద చమురు వినియోగదారు అయిన చైనా తన ముడి చమురు దిగుమతులను కొంతవరకు తగ్గించుకోవడం వల్ల మార్కెట్లో డిమాండ్ ఒత్తిడి కొద్దిగా తగ్గింది. ఇక మూడవది, ఇరాన్ పట్టున్న హోర్ముజ్ జలసంధిని దాటవేస్తూ సౌదీ అరేబియాలోని యాన్బు పోర్ట్ ద్వారా ప్రతిరోజూ సుమారు 5 మిలియన్ బ్యారెళ్ల చమురును సురక్షితంగా రవాణా చేస్తుండటం మార్కెట్‌కు కొంత ఉపశమనాన్ని ఇస్తోంది.
మరోవైపు కొన్ని వారాల క్రితం వరకు అమెరికా, ఇరాన్‌ల మధ్య ఒక శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు 40 శాతం వరకు ఉండేవని, కానీ ప్రస్తుత దాడుల పరంపరతో ఆ ఆశలు పూర్తిగా సన్నగిల్లాయని రిస్టాడ్ ఎనర్జీ ఆందోళన వ్యక్తం చేసింది. రాబోయే రోజులు అత్యంత కీలకమైనవని, దౌత్యపరమైన చర్చల ద్వారా ఉద్రిక్తతలు తగ్గుతాయా లేక యుద్ధం మరింత తీవ్రమవుతుందా అనేది ఈ కొన్ని రోజుల్లోనే తేలిపోతుందని స్పష్టం చేసింది.
నిజానికి గత మూడు నెలలుగా పశ్చిమ ఆసియాలో నెలకొన్న సాయుధ సంక్షేపం కారణంగా ప్రపంచ ముడి చమురు సరఫరా వ్యవస్థ నుండి సుమారు 1 బిలియన్ బ్యారెళ్ల చమురు అదృశ్యమైంది. ఈ మొత్తం పరిమాణం అమెరికా దేశ మొత్తం వ్యూహాత్మక చమురు నిల్వల సామర్థ్యానికి దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. ఈ భారీ కొరత వల్లే చమురు మార్కెట్‌లో విపరీతమైన అస్థిరత పెరిగింది. అంతర్జాతీయంగా కాల్పుల విరమణ ఒప్పందం మరింత బలపడే వరకు లేదా ఇరు దేశాలు తిరిగి చర్చల బల్ల వద్దకు వచ్చే వరకు చమురు ధరల్లో ఈ మార్కెట్ మంటలు , అస్థిరత ఇలాగే కొనసాగుతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications
