కరోనా కష్టకాలంలో సపోర్ట్ ... మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా ‘వియ్ హబ్’
కరోనా మహమ్మారి ప్రభావం అన్ని పరిశ్రమల మీద పడింది. ఇప్పటికే కరోనా లాక్ డౌన్ పరిశ్రమలు ఆర్థికంగా చితికి పోతున్నాయి. నష్టాల ఊబిలో చిక్కుకుపోతున్నాయి. ఇక మహిళా పారిశ్రామిక వేత్తలు కరోనా దెబ్బకు బెంబేలు పడుతున్నారు. అయితే ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలకు కావలసిన సపోర్ట్ అందించటానికి , కొత్తగా ప్రారంభించిన స్టార్టప్ లను ఆదుకోవటానికి ముందుకు వచ్చింది వియ్ హబ్ . కరోనా కోరల్లో చిక్కుకున్న వియ్ హబ్ లోని స్టార్టప్ కంపెనీలను ఆదుకోవడానికి చర్యలు తీసుకున్నట్టు సీఈఓ దీప్తి రావుల తెలిపారు.

మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సపోర్ట్ చెయ్యనున్న వియ్ హబ్
కరోనా మహమ్మారి ప్రభావం అన్ని కంపెనీలపై ఉన్న సమయంలో మహిళా పారిశ్రామిక వేత్తలను కష్టాల నుంచి బయటపడేందుకు తన వంతు సహకారం అందించనుంది వియ్ హబ్ . వ్యాపార ప్రణాళికలు, ఫైనాన్షియల్ మోడలింగ్, కొత్త ఖాతాదారులను సంపాదించడం వంటి అంశాల్లో మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సాయం చేస్తున్నట్లు వియ్ హబ్ సిఈఓ దీప్తి రావుల చెప్పారు. సూక్ష్మ మరియు చిన్న ఎంటర్‌ప్రైజెస్ కోసం ఏర్పాటు చేసిన క్రెడిట్ గ్యారంటీ ఫండ్స్ ట్రస్ట్ ద్వారా స్టార్టప్ లు నిధులు పొందడానికి కూడా వియ్ హబ్ కృషి చేస్తోందని చెప్పారు .

ఇప్పటికే పలు స్టార్టప్ కంపెనీలకు సాయం
కష్టకాలంలో ధైర్యంగా ముందుకు వెళ్లాలని , ఎవరూ అధైర్య పడవద్దని చెప్తున్నారు . ఇప్పటికే విద్యా సంస్థలకు డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సేవలందిస్తున్న రేడియస్ ఎడ్యుటెక్ స్టార్టప్ నకు హార్డ్‌వేర్ ఇబ్బందులు తలెత్తితే ప్రత్యామ్నాయ సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫారమ్ ను ఏర్పాటు చేసుకోవడానికి వియ్ హబ్ సహాయం చేసింది. రేడియస్ ఎడ్యుటెక్‌కు మాత్రమే కాదు సీజీటీఎంఎస్ఈ ద్వారా స్వీట్‌టూత్ స్టార్టప్ నకు రూ.1.35 కోట్ల నిధులు అందే విధంగా వియ్ హబ్ చర్యలు తీసుకుంది. కష్ట కాలంలో బాసటగా ఉంటామని చెప్తున్నారు .

2018లో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రారంభించబడిన వియ్ హబ్
రాష్ట్రంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు టి-హబ్ ఏర్పాటు చేసినట్లే 2018లో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు వియ్-హబ్ ను ఏర్పాటు చేసింది తెలంగాణా సర్కార్ . గచ్చిబౌలి ట్రిపుల్ ఐటి లో ఏర్పాటు చేసిన వియ్-హబ్ ను అప్పుడు రాష్ట్ర ఐటి, పరిశ్రమల మంత్రి కేటిఆర్ ప్రారంభించారు .
రూ.15 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన వియ్-హబ్ లో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన శిక్షణ తో పాటు అన్ని రకాల సహాయసహకారాలు అందిస్తున్నారు .

కరోనా కష్టకాలంలో అండగా వియ్ హబ్
మహిళలకు వారు స్థాపించే పరిశ్రమలు లేదా సంస్థలను బట్టి రూ.25 లక్షల నుంచి కోటి రూపాయల వరకు రుణం కూడా ఇస్తున్నారు . రాష్ట్రంలో అర్హులైన మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పలు స్టార్టప్ కంపెనీలు పెట్టారు. ఇప్పుడు ఊహించని ఉపద్రవంలా వచ్చిన కరోనా దెబ్బకు మహిళా పారిశ్రామిక వేత్తలు మానసికంగా క్రుంగిపోకుండా తమ వంతు సహాయం చేస్తామని ధైర్యంగా ముందు వెళ్లాలని చెప్తుంది వియ్ హబ్ .


Click it and Unblock the Notifications