కరోనా మహమ్మారి దెబ్బతో ఐటీ సంస్థలకు కొత్త ప్రాజెక్టులు రావడం లేదు. ఉన్న ప్రాజెక్టుల్లోను క్లయింట్స్ వ్యయ నియంత్రణ పాటిస్తుండటంతో తగ్గిపోతున్నాయి. ఈ ప్రభావం ఐటీ రంగంలోని ఉద్యోగులపై, వారి వేతనాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే దేశంలో 30వేల మంది ఉద్యోగాలు కోల్పోయి ఉంటారని, 60వేల మంది వేతనం లేని సెలవుల్లో ఉండి ఉంటారని అంచనా. ఇండియాలో ఐటీ, బీపీవోల్లో 43.6 లక్షలమంది పని చేస్తున్నారు. ఇందులో 0.70 శాతం మేర ఉద్యోగ కోత పడిందని అంచనా. పలు ఐటీ కంపెనీలు ఉద్యోగాల కోత, వేతన కోతకు మొగ్గు చూపించాయి. ఈ సమయంలో విప్రో కంపెనీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.

ఉద్యోగులను తొలగించలేదు.. తొలగించం
కరోనా మహమ్మారి కారణంగా విప్రోలో ఒక్క ఉద్యోగినీ తొలగించలేదని, వారిపై వేటు వేసే ప్రణాళికలు కూడా ఏమీ లేవని ఆ కంపెనీ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ సోమవారం స్పష్టం చేశారు. వర్చువల్ విధానంలో జరిగిన కంపెనీ 74వ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM)లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉద్యోగులను తొలగించలేదని, అలాంటి ప్రణాళిక కూడా లేదని షేర్ హోల్డర్లకు తెలిపారు.

కంపెనీ నష్టాలు ఇతర మార్గాల్లో...
కరోనా కారణంగా కంపెనీకి జరిగే నష్టాన్ని ఇతర మార్గాల్లో ఎదుర్కొంటామని రిషద్ ప్రేమ్‌జీ చెప్పారు. నిర్వహణపరమైన మార్పులు, ఇతర విధానాల్లో వ్యయాలు తగ్గించుకుంటామని, కానీ ఉద్యోగులను మాత్రం తొలగించేది లేదని స్పష్టం చేశారు. వివిధ ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల కోత ఉండవచ్చునని నిపుణులు ఆందోళన వ్యక్తం చేసిన సమయంలో విప్రో నుండి ఈ ప్రకటన వచ్చింది.

హెచ్1బీ వీసాలపై
గత ఏడాది జూలై నెలలో చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నారు రిషద్ ప్రేమ్‌జీ. అతనికి ఇది తొలి ఏజీఎం. కరోనా నేపథ్యంలో డిజిటల్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, ఇంజినీరింగ్ కేపబిలిటీస్ పైన మరిన్ని పెట్టుబడులు పెట్టినట్లు చెప్పారు. వర్క్ ఫ్రమ్ హోమ్-వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌ను బ్యాలెన్స్ చేస్తున్నట్లు తెలిపారు. హెచ్1బీ వీసాలపై అమెరికా తీసుకున్న నిర్ణయంపై కూడా స్పందించారు రిషద్. హెచ్1బీ వీసాలను డిసెంబర్ వరకు రద్దు చేస్తూ ట్రంప్ పరిపాలనా విభాగం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇది దురదృష్టకరమని, అయినప్పటికీ విప్రో-అమెరికా కంపెనీల్లో స్థానిక ఉద్యోగులే 70 శాతం వరకు ఉన్నారని, రిస్క్ లేదన్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో విప్రో ఆదాయంలో అమెరికా వాటా 59.1 శాతం. కంపెనీలో భారత్ వెలుపల 41,000కు పైగా ఉద్యోగులు ఉన్నారు. మొత్తం వర్క్ ఫోర్స్ 1,88,270. కాగా, విప్రో క్వార్టర్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి.


Click it and Unblock the Notifications