Bangalore News: పెరుగుతున్న భూతాపానికి తోడు నీటి ఎద్దడి క్రమంగా విస్తృతం అవుతోంది. కొన్నిచోట్ల నీటి చుక్క దొరక్క అల్లాడే పరిస్థితి దాపురించింది. అయితే భారత్‌లో మాత్రం పరిస్థితి కొంత మెరుగ్గానే ఉందని భావిస్తున్నాం. కానీ తాజాగా వినబడుతున్న వార్తలు చూస్తుంటే మాత్రం ఇండియా కూడా దీనికి ఏమాత్రం మినహాయింపు కాదని తెలుస్తోంది. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ సిటీ తీసుకున్న నిర్ణయం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
బెంగళూరు నీటి సరఫరా మరియు మురుగునీటి పారుదల విభాగం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇతరత్రా అవసరాల కోసం తాగునీటి వినియోగాన్ని నిషేధించింది. వాహనాలను శుభ్రపరచడం, తోటపని, భవనాలు మరియు రోడ్ల నిర్మాణం వంటి కార్యకలాపాలకు డ్రింకింగ్ వాటర్ వాడకూడదని స్పష్టం చేసింది. షాపింగ్ మాల్స్, థియేటర్లు తాగునీటి అవసరాలకు మాత్రమే నీటిని వినియోగించేందుకు అనుమతించింది.

ఈ ఆదేశాలను మొదటిసారి ఉల్లంఘిస్తే 5 వేల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఇదే మరోసారి రిపీట్ అయితే అందుకు అదనంగా రోజుకు 500 చెల్లించాల్సిందేనని హుకుం జారీ చేసింది. నీటి సమస్యలకు సంబంధించి సందేహాలు, కంప్లైంట్స్ కోసం ప్రత్యేక కాల్ సెంటర్ ను కూడా ప్రారంభించింది. నిబంధనల ఉల్లంఘనలపై 1916కు కాల్ చేసి సమాచారం అందించాలని కోరింది.
బెంగళూరు జనాభా 1.3 కోట్ల వరకు ఉండగా.. రోజుకి 1500 మిలియన్ లీటర్లు కొరతను ఎదుర్కొంటోంది. ఇంతకుముందు 6 వేల లీటర్ల ట్యాంకర్ కు 600 వరకు వసూలు చేయగా.. ఇప్పుడు అదే ట్యాంకర్ కోసం 3 వేల వరకు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల ధరలను పరిమితం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్క రాజధాని నగరమే కాకుండా 236 తాలూకాలు కరవు పీడిత ప్రాంతాలుగా ప్రకటించింది.


Click it and Unblock the Notifications