రొమాంటిక్ ట్రిప్ కాదది.. హానీట్రాప్? అమ్మాయి 'వలలో' మెహుల్ చోక్సీ
పంజాబ్ నేషనల్ బ్యాంకుకు కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు పారిపోయిన మెహుల్ చోక్సీ అదృశ్యం, అరెస్ట్ వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది. ఆయన తన గర్ల్ ఫ్రెండ్‌తో రొమాంటిక్ ట్రిప్‌కు వెళ్ళగా, డొమినికా పోలీసులకు పట్టుబడినట్లుగా చెబుతున్నారు. అయితే ఇది హానీట్రాప్ అనే మరో వాదన వినిపిస్తోంది. ఆయనను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని మెహుల్ చోక్సీ తరఫు లాయర్లు చెబుతున్నారు. చోక్సీ వెంట ఉన్న అమ్మాయి, ఆయన స్నేహితురాలు కాదని, కిడ్నాప్ టీంలో ఓ పాత్రదారి అని చోక్సీ సన్నిహితులు చెబుతున్నారని వార్తలు వస్తున్నాయి.

ప్రధాని ఏమన్నారంటే?
మెహుల్ చోక్సీ తన గర్ల్ ఫ్రెండ్‌తో విందు కోసం సరదాగా గడిపేందుకు బోటు ద్వారా డొమినికా చేరుకున్నట్లుగా తెలుస్తోందని, అప్పుడు అక్కడి పోలీసులకు పట్టుబడ్డాడని ఆంటిగ్వా ప్రధాని గాస్టన్ బ్రోన్ అన్నారు.
'చోక్సీ తన గర్ల్ ఫ్రెండ్‌తో ఎక్కడికో ప్రయాణిస్తున్నట్లు తమకు సమాచారం అందింది. సరదాగా గడుపుదామనో, డిన్నర్ కోసమో ఆమెతో కలిసి డొమినికాకు బోటులో వెళ్లాడు. అయితే అనుకోకుండా అతను డొమినికాలో పోలీసులకు పట్టుబడ్డాడు. మెహుల్ చోక్సీ తప్పు చేశాడు' అని గాస్టోన్ బ్రౌన్ అన్నారు. అతనిని అక్కడి నుండి భారత్‌కు పంపించే అవకాశాలు ఉన్నాయన్నారు. అయితే చోక్సీ సన్నిహితుల వాదన మరోలా ఉంది.

చోక్సీ సన్నిహితుల వాదన
మెహుల్ చోక్సీతో ఉన్న అమ్మాయి ఆయన స్నేహితురాలు కాదని సన్నిహితులు చెబుతున్నారు. ఆంటిగ్వాకు చెందిన ఆ యువతి ఉదయం, సాయంత్రం వాకింగ్‌కు వెళ్లిన సమయంలో చోక్సీతో పరిచయం పెంచుకొని, స్నేహం చేసిందని చెబుతున్నారు. మే 23వ తేదీన చోక్సీకి ఫోన్ చేసి తన అపార్టుమెంట్‌కు రమ్మని పిలిచిందని, అక్కడకు వెళ్లేసరికి కొంతమంది వ్యక్తులు బలవంతంగా లాక్కెళ్లి బోటులో డొమినికాకు తీసుకెళ్లారని అంటున్నారు. ఆ తర్వాత రెండు రోజులకు డొమినికా బీచ్‌లో చోక్సీని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

కరోనా నెగిటివ్
డొమినికా జైలులో ఉన్నట్లు చోక్సీ ఫోటోలు విడుదలయ్యాయి. అందులో ఆయన చేతులు, కంటిపై గాయాలు ఉన్నాయి. ఆయనను తీవ్రంగా కొట్టి ఉంటారని ఆయన తరఫు లాయర్లు చెబుతున్నారు. దీనిపై వారు కోర్టుకు వెళ్లడంతో చోక్సీని ఆసుపత్రికి తరలించారు. ఆయనకు కరోనా పరీక్షలు కూడా చేయగా నెగిటివ్ వచ్చింది.


Click it and Unblock the Notifications