Flipkart: దేశీయ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ రాకెట్ వేగంతో వృద్ధిలో దూసుకుపోతుంది. దీన్ని గమనించిన US రిటైల్ దిగ్గజం.. కంపెనీలో తన వాటాని మరింత పెంచుకుంది. ఇందుకోసం పెద్ద మొత్తంలో చెల్లించినట్లు తెలుస్తోంది. ప్రధాన వ్యాపారం ఫ్లిప్‌కార్ట్ సహా మింత్రా, ఫోన్ పే కూడా భవిష్యత్తులో మంచి లాభాలను సమకూర్చే కల్ప వృక్షంగా ఉన్నట్లు భావిస్తోంది.
ఫ్లిప్‌కార్ట్‌లో మెజారిటీ వాటా ఉన్న వాల్‌మార్ట్ మరో అడుగు ముందుకు వేసింది. 3.5 బిలియన్ డాలర్లను వెచ్చించి కంపెనీలో ఉన్న తన వాటాను 80.5 శాతానికి పెంచుకుంది. ఇందుకు సంబంధించిన షేర్లను హెడ్జ్ ఫండ్ టైగర్ గ్లోబల్ మరియు యాక్సెల్ పార్టనర్స్ నుంచి కొనుగోలు చేసింది. ఈ మేరకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఫైలింగ్ లో డీల్ వివరాలను వాల్‌మార్ట్ వెల్లడించింది.

గత నెలలో జరిగిన ఇన్వెస్టర్ కాల్ లోనూ ఫ్లిప్‌కార్ట్ వృద్దిపట్ల వాల్‌మార్ట్ హర్షం వ్యక్తం చేసింది. జూన్ త్రైమాసికంలో 26 శాతం వృద్ధి కనబరిచినట్లు పేర్కొంది. ఇండియాలో ఫ్యాషన్, లైఫ్ స్టైల్ ఉత్పత్తులతో మింత్రా మార్కెట్ లీడర్ గా కొనసాగుతోందని, 6 వేల కంటే ఎక్కువ బ్రాండ్ల యాక్సెస్ కలిగి ఉన్నట్లు చెప్పింది. మరో అనుబంధ సంస్థ ఫోన్ పేలో కూడా బలమైన వృద్ధి ఉన్నట్లు వెల్లడించింది. వీటిలో వాటా కలిగి ఉండడం పట్ల వాల్ మార్ట్ CEO జుడిత్ మెక్ కెన్నా హర్షం వ్యక్తం చేశారు.
వాల్ మార్ట్ CFO జాన్ డేవిడ్ రైనీ కూడా ఫ్లిప్‌కార్ట్ GMV పట్ల ప్రశంసలు కురిపించారు. అడ్వర్టైజింగ్ ట్రావెల్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ సహా పలు సేవలను మరింత విస్తరించాలని చూస్తున్నట్లు చెప్పారు తద్వారా స్థిరమైన పురోగతి పనితీరుతో లాభాలను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తామన్నారు. ఫ్లిప్కార్ట్ నుంచి విడిపోయిన ఫోన్ పే కూడా సరికొత్త సేవలను ప్రవేశ పెడుతూ, మరింత మార్కెట్ వాటా దక్కించుకునే పనిలో ఉందని చెప్పారు


Click it and Unblock the Notifications