Go First: దేశీయ విమానయాన రంగంలో లోకాస్ట్ బడ్జెట్ క్యారియర్ గో ఫస్ట్ అకస్మాత్తుగా దివాలా ప్రక్రియకు వెళుతున్నట్లు ప్రకటించింది. అయితే ఈ క్రమంలో యజమాని వాడియా గ్రూప్ బ్యాంకులతో వన్-టైమ్ సెటిల్‌మెంట్‌కు ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇప్పటి వరకు ఏ రుణంపై కూడా విమాన సంస్థ డిఫాల్ట్ కాలేదు కాబట్టి తాజా సెటిల్మెంట్ ప్రణాళిక ద్వారా భారీగా తగ్గింపును పొందవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో మాట్లాడిన గో ఫస్ట్ సీఈఓ కౌశిక్ ఖోనా.. దివాలా పిటిషన్ పరిష్కారం కోసం మాత్రమేనని.. ప్రమోటర్ వాడియా గ్రూప్ ఎయిర్‌లైన్ నుంచి నిష్క్రమించడం లేదని చెప్పారు.

17 సంవత్సరాలకు పైగా విమానాలను నడుపుతున్న గో ఫస్ట్.. సెక్షన్-7, సెక్షన్-9కి బదులుగా సెక్షన్-10 కింద ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్‌రప్ట్సీ(IBC) పిటిషన్ దాఖలు చేసింది. పరిస్థితులను చక్కదిద్దేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించినప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ వ్యవహారంలో తమ ప్రమేయం ఉండదని స్పష్టం చేసింది. NCLT దీనిని పరిష్కరిస్తుందని తెలిపింది.
సంచలన నిర్ణయంతో మార్చి 2న తన విమానాలను తాత్కాలికంగా రెండు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. అయితే ఈ గడువును కంపెనీ క్రమంగా పెంచుకుంటూ పోతోంది. ఈ క్రమంలో ఈనెల 12 వరకు విమానాలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. టిక్కె్ట్లు కొన్న ప్రయాణికులకు డబ్బు పూర్తిగా రిఫండ్ చేస్తామని వెల్లడించింది.
ప్రతిరోజూ 180-185 ఫ్లైట్లను నడుపుతూ 30,000 మందిని గమ్యస్థానాలకు చేర్చేది. ఇంజన్ల సప్లై కారణాలతో 28 విమానాలను ఇప్పటికే గ్రౌండ్ చేసింది. ఈ ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబర్ నాటికి విమానయాన సంస్థ కార్యకలాపాలు తిరిగి ప్రారంభించవచ్చని అంచనా వేస్తోంది.
అయితే భారత విమానయాన చరిత్రను ఒకసారి గమనిస్తే.. గ్రౌండింగ్ తర్వాత ఏ విమానయాన సంస్థ కూడా కార్యకలాపాలను తిరిగి ప్రారంభించిన దాఖలాలు లేవు. దీనికి ముందు జెట్ ఎయిర్‌వేస్ కంపెనీని తిరిగి పునరుద్ధరించాలని సుదీర్ఘంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి కార్యరూపం దాల్చటం లేదు.


Click it and Unblock the Notifications