Vodafone Idea: షాక్ ఇవ్వనున్న వొడఫోన్ ఐడియా.. 5G ఎప్పటి నుంచి అంటే..?
Vodafone Idea: టెలికాం రంగంలో జియో రారాజుగా మారటంతో ఇతర కంపెనీల మనుగడకే కష్టపడుతున్నాయి. వాటిలో వొడఫోన్ ఐడియా ఒకటి. అయితే దేశంలో 4జీ సామర్థ్యాన్ని విస్తరిస్తూనే.. 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురావటానికి నిధులు చాలా కీలకమైనదని కంపెనీ సీఈవో అక్షయ మూండ్రా అన్నారు. అపరిమిత ప్లాన్‌లలో ఎక్కువ మంది కస్టమర్‌లను పొందాలనే తన లక్ష్యాన్ని కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు.

రేట్ల పెంపు అత్యవసరం..
పోటీ పరిస్థితుల్లో ఆదాయాన్ని పెంచుకునేందుకు ARPU(Average Revenue Per User) పెరగాలని కంపెనీ అంటోంది. నిరంతరం పెట్టుబడులకు మద్దతు ఇచ్చేందుకు "టారిఫ్ కరెక్షన్" అవసరమని సీఈవో అన్నారు. అయితే ప్రస్తుతం భారతదేశంలో రేట్లు స్థిరమైన స్థాయిలో కొనసాగుతున్నాయని ఆయన అన్నారు. ప్రస్తుతం 4జీ విస్తరణ, 5Gని ప్రారంభించేందుకు నిధుల సమీకరణ చాలా కీలకమని ఆయన అంగీకరించారు.

5జీ ప్రారంభం..
కంపెనీ దేశంలో 5జీ సేవల ప్రణాళికలతో సిద్ధంగా ఉందని.. ఇందుకు అవసరమైన వెండార్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. నిధులు పొందిన తర్వాత 5జీని కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలను ఈక్విటీగా మార్చేందుకు ఉన్న అడ్డంకులపై ప్రశ్నించగా.. దానికి గల కారణాలు తెలియవని చెప్పారు.

కంపెనీ అప్పులు..
వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి కంపెనీ దాదాపు రూ.9,600 కోట్ల రుణాన్ని చెల్లించాల్సి ఉంది. కానీ ప్రస్తుతం కంపెనీ దగ్గర మొత్తం నగదు నిల్వ రూ.200 కోట్లు మాత్రమే ఉంది. అయితే 2020 నుంచి కంపెనీ ఈక్విటీ డెట్ ద్వారా రూ.20,000 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది.

Q2 ఫలితాల ప్రకారం..
Q2 FY23 ప్రకారం కంపెనీకి ప్రతి వినియోగదారుడి నుంచి వస్తున్న సగటు ఆదాయం రూ.131గా ఉంది. ఇది ఇతర పోటీదారులకంటే తక్కువ. భారతీ ఎయిర్ టెల్ నెలకు కస్టమర్ల నుంచి సగటున అత్యధికంగా రూ.190 ఆర్జిస్తోంది. ఇదే సమయంలో జియో రూ.175.7 నెలకు యూజర్ సగటు ఆదాయాన్ని(ARPU) పొందుతోంది.

కస్టమర్లకు చేరువయ్యేందుకు..
వోడాఫోన్ ఐడియా తన రిటైల్ సర్వీస్ సెంటర్లను విస్తరించడం ప్రారంభించింది. మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్‌లలో 300 కొత్త-ఫార్మాట్ 'Vi షాప్‌లను' ప్రారంభించింది. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తమ ఉనికిని విస్తరించడంపై కంపెనీ దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. కస్టమర్లకు ఫాస్ట్, ఫేస్ టూ ఫేస్ సర్వీసెస్ అందించేందుకు ఇవి తోడ్పడతాయని కంపెనీ వెల్లడించింది.


Click it and Unblock the Notifications