Stock Market: రివ్వున ఎగిరిన వొడాఫోన్ ఐడియా షేర్లు.. రెండు వారాల గరిష్ఠానికి స్టాక్
Stock Market: టెలికాం సర్వీస్ ప్రొవైడర్ గా జియో, ఎయిర్ టెల్ దూసుకుపోతున్న వేళ.. వొడాఫోన్ ఐడియా(VI) మాత్రం చతికిల పడింది. ప్రతినెలా కస్టమర్లను కోల్పోతూ తీవ్ర ఇబ్బందుల్లోకి కూరుకుపోయింది. అయితే ప్రస్తుత క్వార్టర్లీ రిజల్ట్స్ సమయంలో VI షేర్లు అమాంతం ఎగసిపడుతున్నాయి.
వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ షేర్ ఈరోజు ఒకానొక సమయంలో 8 శాతానికిపైగా లాభాలతో ట్రేడయింది. శుక్రవారం కూడా 1.4 శాతం మేర స్టాక్ లాభపడింది. ఇలా కొనసాగడం ఇది వరుసగా రెండవ రోజు. అయితే అంతకు ముందు 4 రోజులపాటు వరుస నష్టాలను కంపెనీ చవిచూడాల్సి వచ్చింది.

అక్టోబర్ 19 తర్వాత అత్యధిక ఇంట్రాడే గరిష్ఠ స్థాయి 11.95ని ఇవాళ VI స్టాక్ టచ్ చేసింది. రాబోయే త్రైమాసికాల్లో తమ 5G నెట్ వర్క్ ను రోల్ అవుట్ చేయడానికి కంపెనీ గణనీయమైన పెట్టుబడులు పెట్టనుందని కంపెనీ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా ప్రకటించడం దీనికి ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
VI తన 5G నెట్ వర్క్ విడుదలపై నిర్ధిష్ట టైమ్ లైన్ ప్రకటించలేదు. గతేడాది అక్టోబర్ లో త్వరలో ఈ విషయంపై ముందుకెళ్తామని మాత్రమే బిర్లా చెప్పారు. ఇక ఈ ఏడాది ఏప్రిలోనూ ఇదే వ్యాఖ్యను పునరుద్ఘాటించారు. అయితే ఇటీవల త్రైమాసికాల్లో VI నికర నష్టం 8 వేల 738 కోట్లకు విస్తరించింది. అంచనాలకు మించి ట్యాక్స్ కట్టాల్సి రావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
బ్రోకరేజ్ సంస్థ CLSA 2024-26కు సంబంధించి VI ఆదాయం, EBITDA అంచనాలను వరుసగా 5 మరియు 14 శాతం మేర తగ్గించింది. సెల్ రేటింగ్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ 6గా పేర్కొంది. ఈ స్టాక్ ను ట్రాక్ చేసే 17 మంది విశ్లేషకుల్లో 14 మంది ఇదే విదంగా సెల్ రేటింగ్ ఇచ్చారు. కాగా మిగిలిన ముగ్గురూ హోల్డ్ తో సరిపెట్టారు. కానీ ఏ ఒక్కరూ బై కాల్ ఇవ్వలేదు.
ఇక టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) తాజాగా విడుదల చేసిన డేటా కూడా వొడాఫోన్ ఐడియాకు షాకిచ్చింది. జూలైలో 1.3 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లను VI నెట్ వర్క్ కోల్పోయినట్లు తెలిపింది. ఏప్రిల్ మరియు మే నెలల్లోనూ 3 మిలియన్ల మంది కంపెనీని వీడినట్లు పేర్కొంది.


Click it and Unblock the Notifications