భారతదేశంలో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యక్తిగత సంపద, ఆస్తులు, విలాసవంతమైన జీవితం ఎప్పుడూ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూనే ఉన్నాయి. ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన రాజకీయ నాయకులలో ఒకరిగా పరిగణించబడే పుతిన్ సంపదపై వివిధ అంతర్జాతీయ మీడియా సంస్థలు సంచలనాత్మక వివరాలు వెల్లడించాయి.
అధికారిక క్రెమ్లిన్ పత్రాల ప్రకారం ఆయన వార్షిక ఆదాయం కేవలం 140,000 డాలర్లు (సుమారు రూ.1.20 కోట్లు) మాత్రమే అని పేర్కొంది. అయితే వాస్తవంగా ఆయన జీవనశైలి, రాజభవనాలు, వ్యక్తిగత విమానాలు, విలాసవంతమైన యాచ్ట్‌లు, అపారమైన కార్ల సేకరణ..ఈ వస్తువులన్నీ ఈ సంఖ్యను పూర్తిగా ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి.
ఫార్చ్యూన్ నివేదిక ప్రకారం.. Putin అధికారిక ఆస్తులుగా కేవలం 800 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్, మూడు కార్లను మాత్రమే నమోదు చేసినప్పటికీ, ఆయనకు ఉన్న అసలైన సంపద అసాధారణ స్థాయిలో ఉందని అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్లాదిమిర్ పుతిన్ తరచుగా ధరించే లగ్జరీ గడియారాల విలువే ఆయన సంవత్సర జీతాన్ని మించినదని చెబుతారు.

60 వేల డాలర్ల విలువైన పాటెక్ ఫిలిప్ పెర్పెచువల్ క్యాలెండర్ 500,000 డాలర్ల A. లాంగే & సోహ్నే టౌబోగ్రాఫ్ గడియారాలు ఆయన సొంతం అని నివేదికలు చెబుతున్నాయి. ఇలాంటివి ఆయన అపారమైన లగ్జరీ జీవితానికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమేనని చెప్పవచ్చు.
పుతిన్ యొక్క అత్యంత ప్రసిద్ధ ఆస్తుల్లో ఒకటి నల్ల సముద్రం ఒడ్డున కొండపై నిర్మించబడిన 190,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న భారీ ప్రైవేట్ మహల్. పుతిన్స్ కంట్రీ కాటేజ్ గా పిలువబడే ఈ ఎస్టేట్ రష్యాలో అత్యంత పెద్ద ప్రైవేట్ ప్రాపర్టీగా చెబుతారు. దీనిలో ఫ్రెస్కోడ్ పైకప్పులు, గ్రీకు దేవుళ్ల విగ్రహాలతో అలంకరించిన పాలరాయి స్విమ్మింగ్ పూల్, 27,000 చదరపు అడుగుల గెస్ట్ హౌస్, సాంప్రదాయ హమామ్‌లతో స్పాలు, మ్యూజికల్ పార్లర్, అత్యాధునిక ఐస్ హాకీ రింక్, వెగాస్ తరహా క్యాసినో, స్ట్రిప్పర్ పోల్స్ ఉన్న నైట్ క్లబ్, రూ. 80 లక్షల కంటే ఎక్కువ విలువైన వైన్స్‌తో ప్రత్యేక భూగర్భ రూమ్ వంటి అద్భుతమైన సౌకర్యాలు ఉన్నాయి.
ప్రఖ్యాత ఇటాలియన్ ఆర్కిటెక్ట్ లాన్‌ఫ్రాంకో సిరిల్లో రూపొందించిన ఈ బ్లాక్ సీ మాన్షన్ నిర్మాణానికి 1.4 బిలియన్ డాలర్లు ఖర్చయిందని చెబుతారు. ఇదొక్కటే కాదు, పుతిన్ వద్ద 19 ఇతర విలాసవంతమైన ఆస్తులు, 700 కార్లు, 58 వ్యక్తిగత జెట్స్, హెలికాప్టర్ల సేకరణ కూడా ఉంది. వీటిలో ది ఫ్లయింగ్ క్రెమ్లిన్ గా పిలువబడే 716 మిలియన్ డాలర్ల జెట్ కూడా ఉంది. ఇది బంగారు టాయిలెట్‌తో కూడి ఉంటుంది. సముద్ర ప్రయాణాలకు ఆయన వద్ద 100 మిలియన్ డాలర్ల విలువైన ప్రత్యేక మెగాయాచ్ట్ కూడా ఉంది.
ఫార్చ్యూన్ సూచన ప్రకారం.. పుతిన్ నికర విలువ సుమారు 200 బిలియన్ డాలర్లు (రూ. 16.6 లక్షల కోట్లు) గా అంచనా వేయబడింది. ఇది ఆయనను ప్రపంచంలో అత్యంత సంపన్న వ్యక్తుల జాబితాలో అగ్రస్థానానికి దగ్గరగా నిలబెడుతుంది. ఫేస్‌బుక్ స్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్‌ను అధిగమించి, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌కు సమీపంలో పుతిన్ ఉన్నారు. నిజంగా పుతిన్ సంపద ఎంత ఉందనే ప్రశ్నకు అధికారిక సమాధానం లేకపోయినా.. ప్రపంచవ్యాప్తంగా మీడియా, రాజకీయ నాయకులు, ఆర్థిక నిపుణులు ఆయన ధనసంపాదనపై భారీ చర్చలను కొనసాగిస్తూనే ఉన్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి


Click it and Unblock the Notifications