ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను జీరో డెబిట్ సంస్థగా మార్చాలనుకుంటున్న కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ ఆ దిశగా మరో అడుగు వేశారు. ఇప్పటికే రిలయన్స్ అనుబంధ జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి వేలకోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన ఈక్విటీ సంస్థ విస్తా ఈక్విటీ కూడా పెద్ద మొత్తంలో జియ్ ప్లాట్‌ఫాంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది.

రూ.11,367 కోట్లతో 2.3 శాతం వాటా కొనుగోలు
జియో ప్లాట్‌ఫామ్స్‌లో విస్తా ఈక్విటీ రూ.11,367 కోట్ల విలువైన 2.3 శాతం వాటాను దక్కించుకునేందుకు ఇన్వెస్ట్ చేయనుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఫోకస్డ్ ఫండ్ కంపెనీ. ఈ మేరకు గత వారంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవలి కాలంలో రిలయన్స్‌కు ఇది మూడో అతిపెద్ద ఒప్పందం. జియో ప్లాట్‌ఫామ్స్ ఈక్విటీ వ్యాల్యూ రూ.4.91 లక్షల కోట్ల వద్ద ఇన్వెస్ట్ చేసింది. ఎంటర్‌ప్రైజ్ వ్యాల్యూ రూ.5.16 లక్షల కోట్లు.

ఇదీ విస్తా.. ఇండియాలో మొదటి పెట్టుబడి
విస్తా ఈక్విటీ మొదటి నుండి అత్యాధునిక టెక్ కంపెనీలలో పెట్టుబడులు పెడుతోంది. గత పదేళ్లలో ఈ సంస్థ పెట్టుబడులు పెట్టిన కంపెనీలు చాలా వరకు లాభాల్లో ఉన్నాయి. మన దేశంలో విస్తా ఈక్విటీ పెట్టుబడి పెట్టడం ఇదే మొదటిసారి. ఈ పెట్టుబడి ద్వారా జియో నిర్వహణ నాణ్యతపై వ్యాపార వర్గాల్లో నమ్మకం పెరుగుతుంది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో రిలయన్స్ తర్వాత ఫేస్‌బుక్, ఆ తర్వాత అతిపెద్ద పెట్టుబడి విస్తా ఈక్విటీది.

ఇటీవలే ఫేస్‌బుక్, సిల్వర్ లేక్
ఈ ఆర్థిక సంవత్సరంలో పెద్ద ఎత్తున జియో ప్లాట్ ఫామ్స్‌లోకి పెట్టుబడులు వచ్చాయి. పెద్ద ఎత్తున కంపెనీలు వాటాలు దక్కించుకున్నాయి. మొదట జియో-ఫేస్‌బుక్ మధ్య రూ.43,574 కోట్ల డీల్ కుదిరింది. ఈ పెట్టుబడితో ఫేస్‌బుక్ 9.99 శాతం వాటాను దక్కించుకుంది. ఆ తర్వాత అమెరికా ప్రయివేటు ఈక్విటీ దిగ్గజం సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్.. జియో ప్లాట్‌ఫామ్స్‌లో 1 శాతం వాటాను రూ.5,655 కోట్లకు కొనుగోలు చేసింది.

3 వారాల్లో రూ.60,596 కోట్లు సేకరణ
రిలయన్స్ జియో ప్రపంచస్థాయి పెట్టుబడులను పెద్ద మొత్తంలో ఆకర్షిస్తోంది. ఫేస్‌బుక్ వంటి టెక్ దిగ్గజం పెట్టుబడుల తర్వాత టెక్ ఫోకస్డ్ ఫండ్ నడుపుతున్న విస్తా ఈక్విటీ ఇప్పుడు జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. జియో ప్లాట్‌ఫామ్స్ ప్రముఖ టెక్నాలజీ ఇన్వెస్టర్ల నుండి మూడు వారాల్లోనే రూ.60,596 కోట్లు సేకరించింది. ఈ మేరకు రిలయన్స్ ఓ ప్రకటన చేసింది.


Click it and Unblock the Notifications