కర్ణాటక క్యాబినెట్ 153 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న విశ్వగురు బసవన్న బయోడైవర్సిటీ పార్కుకు ఆమోదం తెలపింది. ఈ పార్కు రాకతో బెంగళూరు నగరం తన పర్యావరణ వారసత్వంలో మరో కీలక అధ్యాయాన్ని యాడ్ చేసుకోనుంది. అటవీ శాఖ అభివృద్ధి చేయనున్న ఈ ప్రాజెక్ట్‌ను నగరంలోని మూడవ అతిపెద్ద గ్రీన్ లంగ్ గా అభివర్ణిస్తున్నారు. వేగంగా పట్టణీకరణ చెందుతున్న బెంగళూరుకు ఇది ఒక ప్రధాన పర్యావరణ మైలురాయిగా నిలవనుంది.
ఈ బయోడైవర్సిటీ పార్క్‌ను ఉత్తర బెంగళూరులోని యలహంక ప్రాంతంలోని మదప్పనహళ్లి సమీపంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్‌కు మొత్తం రూ. 50 కోట్ల వ్యయం కేటాయించారు. గత శతాబ్దంలో బెంగళూరులో చేపట్టిన అత్యంత ముఖ్యమైన పర్యావరణ ప్రాజెక్టులలో ఇది ఒకటిగా భావిస్తున్నారు. నగరంలో పెరుగుతున్న కాంక్రీట్ నిర్మాణాల మధ్య ఈ ఉద్యానవనం ఒక పెద్ద సహజ హార్ట్ గా పనిచేస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఆమోదంతో, లాల్‌బాగ్ (1760), కబ్బన్ పార్క్ (1870) తర్వాత చాలా కాలానికి బెంగళూరులో ఒక పెద్ద ప్రజా ఉద్యానవనం ఏర్పాటు కానుంది. పెరుగుతున్న జనాభా, వాహన కాలుష్యం, భవనాల విస్తరణ వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న నగరానికి ఇలాంటి పెద్ద బహిరంగ పచ్చదన ప్రాంతాలు అత్యవసరమని నిపుణులు చెబుతున్నారు. ఈ ఉద్యానవనం కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్య సంరక్షణ, ప్రజల అవగాహన పెంపు కేంద్రంగా కూడా అభివృద్ధి చేయనున్నారు.
ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటిస్తూ.. కర్ణాటక అటవీ, జీవావరణ శాస్త్రం, పర్యావరణ మంత్రి ఈశ్వర్ బి. ఖండ్రే దీనిని బెంగళూరు భవిష్యత్తుకు ఒక చారిత్రాత్మక నిర్ణయంగా అభివర్ణించారు. Vishwaguru Basavanna Biodiversity Park బెంగళూరుకు అత్యంత అవసరమైన హరిత హారంగా మారుతుంది. ఇది పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు, ప్రజలకు విశ్రాంతి, వినోదానికి ఒక విశాలమైన ప్రదేశాన్ని అందిస్తుందని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టుకు మద్దతు ఇచ్చిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు మంత్రివర్గ సహచరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
యలహంక, దాని పరిసర ప్రాంతాలు ఇటీవలి సంవత్సరాలలో వేగంగా పట్టణీకరణ చెందుతున్నాయి. విమానాశ్రయం, ఐటీ కారిడార్లు, నివాస ప్రాజెక్టులతో ఈ ప్రాంతం భారీ అభివృద్ధిని చూసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బయోడైవర్సిటీ పార్క్ ఉత్తర బెంగళూరుకు పర్యావరణ సమతుల్యతను తిరిగి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించనుంది. ఇది జీవవైవిధ్యానికి మద్దతు ఇవ్వడంతో పాటు, విద్యార్థులు, కుటుంబాలు, ప్రకృతి ప్రేమికులకు ఒక పెద్ద అభ్యాస, విశ్రాంతి కేంద్రంగా మారనుంది. లైవ్ లోకి వచ్చిన తర్వాత విశ్వగురు బసవన్న బయోడైవర్సిటీ పార్క్ బెంగళూరులో మూడవ అతిపెద్ద పార్క్‌గా గుర్తింపు పొందనుంది.


Click it and Unblock the Notifications