IPO News: ఈవారం దేశీయ స్టాక్ మార్కెట్లోకి తొలి ఐపీవో అడుగు పెట్టేసింది. వస్తూ వస్తూనే లాభాల లచ్చిందేవిని వెంటపెట్టుకొచ్చి ప్రీమియం ధరకు లిస్టింగ్ జరిగింది. దీంతో ఇన్వెస్టర్లు ఒక్క రోజులోనే భారీ లాభాలను ఆర్జించారు.
కొత్తగా నేడు స్టాక్ ఎక్స్ఛేంజీల్లోకి విష్ణు ప్రకాష్ ఆర్ పుంగ్లియా లిమిటెడ్ కంపెనీ షేర్లు అరంగేట్రం చేశాయి. ఈ షేర్లు ఎన్ఎస్ఈలో ఒక్కొక్కటి రూ.165 వద్ద జాబితా చేయబడ్డాయి. కంపెనీ ఒక్కో షేరును రూ.99కి ఆఫర్ చేయగా.. 66.66 శాతం ప్రీమియం ధరకు బలమైన లిస్టింగ్ నమోదైంది. ఇదే క్రమంలో బీఎస్ఈలో విష్ణు ప్రకాష్ కంపెనీ షేర్లు 65 శాతం ప్రీమియంతో రూ.163.30 రేటు వద్ద లిస్ట్ అయ్యాయి. అయితే లిస్టింగ్ తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మెుగ్గుచూపటంతో 10 శాతానికి పైగా క్షీణించాయి.

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అయిన విష్ణు ప్రకాష్ ఆర్ పుంగ్లియా లిమిటెడ్ దేశీయ మార్కెట్ల నుంచి రూ.308.88 కోట్లను ఐపీవో రూపంలో సమీకరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో సబ్‌స్క్రిప్షన్ కోసం ఆగస్టు 24 నుంచి 28 వరకు ఐపీవోను తెరిచింది. ఇన్వెస్టర్ల నుంచి బలమైన స్పందనతో ఐపీవో మెుత్తం 87.82 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది.
పబ్లిక్ ఇష్యూ రిటైల్ కేటగిరీ 32.01 రెట్లు, క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ కొనుగోలుదారుల విభాగంలో 171.69 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ (NII) వర్గం 111.03 సార్లు బుక్ చేయబడింది. ఈ క్రమంలో ఈక్విటీ షేర్ల ధరను రూ.94-99గా నిర్ణయించింది. ఐపీవోలో ఒక్కో లాటులో 150 షేర్లు ఉండేలా కంపెనీ నిర్ణయించింది. ఐపీవో ద్వారా సమీకరిస్తున్న మెుత్తాన్ని కంపెనీ పరికరాలు యంత్రాల కొనుగోలు, కంపెనీ వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం వినియోగించాలని ప్రతిపాదించింది.

ఉదయం 11.05 గంటల సమయంలో విష్ణు ప్రకాష్ షేర్ ధర ఎన్ఎస్ఈలో రూ.149.10 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో బీఎస్ఈలో కంపెనీ షేర్ ధర రూ.148.72 వద్ద ట్రేడవుతోంది. అయితే ఇంట్రాడేలో స్టాక్ గరిష్ఠంగా రూ.164.45 రేటును తాకింది. భారీగా లాభాలు రావటంతో ఇన్వెస్టర్లు హుషారుగా ప్రాఫిట్ బుక్కింగ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications