Vijవిజయవాడ వాసులకు ఇది నిజంగా తీపి కబురు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న విజయవాడ వెస్ట్ బైపాస్ (Vijayawada West Bypass) ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. గడిచిన సంక్రాంతి కానుకగా ఈ కీలక రహదారిని పాక్షికంగా ప్రారంభించడం వల్ల నగరంలో ట్రాఫిక్ కష్టాలు గణనీయంగా తగ్గనున్నాయి. అసలు ఈ రూట్ ఏయే ఏరియాలను కవర్ చేస్తుంది? దీని వల్ల ఏయే రూట్లలో వెళ్లేవాళ్లకి లాభం అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అధికారులు గడిచిన శుక్రవారం సంప్రదాయ పూజా కార్యక్రమాలు నిర్వహించి, వాహనాల రాకపోకలను అనుమతించారు. ఈ కొత్త రహదారి గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని కాజ (Kaja) నుండి కృష్ణా జిల్లాలోని పెద అవుటపల్లి (Peda avutupally) వరకు విస్తరించి ఉంది.
గుంటూరు, చెన్నై నుంచి వచ్చే వాళ్లకు..
ఈ మార్గం అందుబాటులోకి రావడం వల్ల చెన్నై, గుంటూరు వైపు నుండి వచ్చే వాహనాలు, విజయవాడ నగరంలోకి ప్రవేశించాల్సిన అవసరం లేకుండానే నేరుగా ఏలూరు, విశాఖపట్నం వైపు వెళ్ళిపోవచ్చు. కాజ టోల్ ప్లాజా దాటిన తర్వాత వెస్ట్ బైపాస్ ఎక్కి గొల్లపూడి, చిన అవుటపల్లి మీదుగా జాతీయ రహదారిని చేరుకోవచ్చు.
ట్రాఫిక్ కష్టాలకు చెక్.. హైదరాబాద్ ప్రయాణం మరింత సులభం!
విజయవాడ (Vijayawada) ట్రాఫిక్ డీసీవో శ్రీన్ బేగం తెలిపిన వివరాల ప్రకారం, ఈ బైపాస్ వల్ల పండుగ సీజన్లలో నగరంలో ఏర్పడే ట్రాఫిక్ ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది.
- హైదరాబాద్ రూట్: గుంటూరు నుండి హైదరాబాద్ వెళ్లే వారు విజయవాడ నగరంలోకి రావాల్సిన పనిలేదు. గొల్లపూడి వద్దే విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిని చేరుకోవచ్చు.
- ఏలూరు రూట్: ఏలూరు వైపు వెళ్లే ప్రయాణికులకు కూడా ఇది అత్యంత వేగవంతమైన, సులభమైన మార్గంగా మారుతుంది.
గొల్లపూడి నుండి వెళ్లే వారికి కొన్ని షరతులు
అయితే ప్రస్తుతం గొల్లపూడి వైపు నుండి వచ్చే వాహనాలను కాజ వైపు వెళ్లడానికి అధికారులు ఇంకా అనుమతించలేదు. అక్కడ కొన్ని నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి, గొల్లపూడి నుండి వచ్చే వాహనాలు కృష్ణా నదిపై ఉన్న వంతెనను దాటి, సీడ్ యాక్సెస్ రోడ్డు ద్వారా మంగళగిరి-మందడం రోడ్డుకు చేరుకోవచ్చు. దీనివల్ల అమరావతి సెక్రటేరియట్, హైకోర్టుకు వెళ్లే వారికి మార్గం సులభతరం అవుతుంది.
పూర్తిస్థాయి ప్రారంభం ఎప్పుడు?
ఈ ప్రాజెక్టుపై NHAI అధికారులు స్పష్టతనిచ్చారు. ప్రస్తుతం వెంకటపాలెం వద్ద టోల్ వసూలు ప్రారంభం కాలేదు. బైపాస్ పనులన్నీ పూర్తిగా పూర్తయ్యాకే టోల్ వసూలు చేస్తారు. మిగిలిన పనులు వచ్చే మార్చి నెల నాటికి పూర్తవుతాయని, అప్పుడు పూర్తిస్థాయిలో రాకపోకలు సాగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఏది ఏమైనా విజయవాడ (Vijayawada) వెస్ట్ బైపాస్ రాకతో నగరం లోపల భారీ వాహనాల రద్దీ తగ్గుతుంది. ఇది కేవలం ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా, ఇంధన పొదుపుకు, కాలుష్య నియంత్రణకు కూడా దోహదపడుతుంది. అమరావతి రాజధాని ప్రాంతానికి కనెక్టివిటీ పెరగడం వల్ల ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్, బిజినెస్ రంగాలు కూడా పుంజుకునే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications