గుజరాత్ అహ్మదాబాద్ విమాన ప్రమాదం మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. దేశ ప్రజలను తీవ్రంగా కలచివేసిన ఈ ఘటనలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయల్దేరిన ఏఐ బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ సమయంలో ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా విజయ్ రూపాని ఎయిర్ పోర్టులో నడుచుకుంటూ వెళ్తున్న వీడియో బయటకు వచ్చింది. గుజరాత్ మాజీ సీఎం విమాన ప్రమాదానికి కొన్ని నిమిషాల ముందు విమానాశ్రయంలో నడుస్తున్నట్లుగా వీడియోలో కనిపిస్తోంది.
లండన్ కు చెందిన యోగా ప్రియుడు జేమీ మీక్ భారతదేశానికి గుడ్ బై చెబుతూ ఓ వీడియో ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. వీడియోలో మేము విమానాశ్రయంలోకి ఇప్పుడే వచ్చాము. లండన్‌కు తిరిగి వెళ్లేందుకు 10 గంటల సమయం పడుతుంది. (Good bye India) గుడ్ బై ఇండియా అంటూ సెల్ఫీ వీడియో తీసుకుంటూ భారత్‌కు వీడ్కోలు చెప్పడం వీడియోలో కనిపిస్తోంది. చాలా సంతోషంగా ఉంది.. ప్రశాంతంగా తిరిగి వెళ్తున్నామంటూ చెప్పుకొచ్చారు.అయితే ఇదే వీడియోలో విజయ్ రూపానీ నడుచుకుంటూ వెళ్తున్నట్లుగా మనం చూడవచ్చు.

ఫియోంగల్ గ్రీన్‌లా-మీక్‌తో కలిసి సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూర్చుని మాట్లాడుతుండగా వెనక నుంచి బిజెపి సీనియర్ నాయకుడు, గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ నడుచుకుంటూ వెళుతున్నారు. నేవీ-బ్లూ నెహ్రూ స్టయిల్ జాకెట్ ధరించి డిపార్చర్ లాంజ్ గుండా ఫోన్‌లో మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఇదే విజయ్ రూపానీ చివరి వీడియో అంటూ సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. వీడియో తీసిన వారికి కూడా అదే చివరి వీడియో కావడం దురదృష్టకరం. ఎన్నో జ్ఞాపకాలతో విమానం ఎక్కిన ప్రయాణికులు.. ఇలా ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని నెటిజన్లు సంతాపం తెలిపారు.
68 ఏళ్ల మాజీ గుజరాత్ ముఖ్యమంత్రి రూపానీ తన భార్య, కుమార్తెను చూసేందుకు లండన్ వెళుతుండగా విమాన ప్రమాదంలో మరణించారు. ఆయన మధ్యాహ్నం 1:38 గంటలకు 242 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI171, బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్‌లో 2Dలో కూర్చున్నారు.
టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే, విమానం బ్యాలన్స్ కోల్పోయి అహ్మదాబాద్‌లోని మేఘనినగర్ ప్రాంతంలోని ఒక వైద్య కళాశాల నివాస విభాగంలోకి దూసుకెళ్లింది. దీంతో మంటల్లో చిక్కకుంది పూర్తిగా కాలిపోయింది. ఘటనా స్థలంలో చెల్లాచెదురుగా మృతదేహాలు ఉన్నాయి. పేలుడు ధాటికి గుర్తు పట్టలేనంతగా కాలిపోయిన మృతదేహాలు ఉండటంతో శకలాలు తొలగించి మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.


Click it and Unblock the Notifications