టెల్కో వార్: జియో సంచలన ఆరోపణ, ఖండించిన వొడాఫోన్ ఐడియా
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు చట్టాలపై పలు ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రధానంగా హర్యానా, పంజాబ్‌లో ఈ వేడి ఎక్కువగా ఉంది. ఈ ఆందోళనల సెగ టెల్కలకు తాకింది. ఈ పరిణామాలు ప్రధాన టెలికం కంపెనీల మధ్య మాటల యుద్ధానికి తెరలేపాయి. ఇప్పుడు రిలయన్స్ జియో కోర్టు మెట్లు ఎక్కే వరకు వెళ్లింది.
రైతు ఆందోళనల నేపథ్యంలో తమ ప్రత్యర్థులు ఉద్దేశ్యపూర్వకంగా తమ టవర్లను టార్గెట్ చేశారని రిలయన్స్ జియో ఆరోపిస్తోంది. హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో కొందరు జియో టవర్లు ధ్వంసం చేశారు. అయితే ఇది రైతుల పని కాదని, తమ ప్రత్యర్థులు ఈ పని చేయవచ్చునని జియో అనుమానిస్తోంది.

ఆందోళనలు.. జియో టవర్లు టార్గెట్
తమ సంస్థకు చెందిన కమ్యూనికేషన్ టవర్లను ధ్వంసం చేయడంపై రిలయన్స్ పంజాబ్, హర్యానా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీని వెనుక తమ వ్యాపార ప్రత్యర్థుల ప్రమేయం ఉండే అవకాశం ఉందని ఆరోపించింది. ఇలాంటి విధ్వంసం నుండి తమ ఉద్యోగులు, ఆస్తులను కాపాడేలా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేసింది. రైతు చట్టాల రద్దు డిమాండ్ చేస్తూ ఆందోళనలు సాగుతుండగా, కొంతమంది ఆందోళనకారులు పంజాబ్‌లోని రిలయన్స్‌కు చెందిన జియో 1500 మొబైల్ టవర్లను ధ్వంసం చేశారు. రిలయన్స్ ఫ్రెష్ దుకాణాలను మూయించారు.

వొడాఫోన్ ఐడియా ఖండన
జియో ఆరోపణలపై వొడాఫోన్ ఐడియా(VI) స్పందించింది. దేశంలోని ఏ ఆపరేటర్ నెట్ వర్క ఇన్‌స్టాలేషన్ పైన అయిన ప్రభావం చూపే అలాంటి కార్యకలాపాల్లో VI ఎప్పటికీ భాగం కాదని, తమను ఇరికించేందుకు, తమకు నష్టం కలిగించేందుకు కుట్రపూరితంగా ఈ వాదన తెరపైకి తెచ్చినట్లుగా కనిపిస్తోందని పేర్కొంది. అలాగే, టెలికం మౌలికసదుపాయాల విధ్వంసాన్ని ఖండిస్తున్నట్లు తెలిపింది.

ఎయిర్ టెల్ ఖండన
జియో ఆరోపణలపై ఇప్పటికే ఎయిర్ టెల్ కూడా స్పందించింది. జియో చేసిన ఆరోపణలు నిరాధారమని భారతీ ఎయిర్‌టెల్ పేర్కొంది. జియో ఆరోపణలకు ఆధారాలున్నాయా అని ప్రశ్నించింది. పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో జియోకు చెందిన టవర్లపై దాడులు జరిగాయని, రైతుల ఆందోళన వెనుక ప్రత్యర్థులు ఉన్నారని జియో ఆరోపించడం సబబుకాదని ఎయిర్‌టెల్ చీఫ్ రెగ్యులేటరీ ఆఫీసర్ రాహుల్ తెలిపారు.
గతంలో కూడా జియో తమ పైన ఫిర్యాదు చేసిందని ఎయిర్ టెల్ చీఫ్ రెగ్యులేటరీ ఆఫీసర్ రాహుల్ వాట్స్ పేర్కొన్నారు. రైతుల ఆందోళన వెనుక ఎయిర్‌టెల్ ఉందని జియో ఆరోపించడం సరికాదని తెలిపింది. ఒకవేళ అదే పవర్ తమకు ఉంటే మూడేళ్ల క్రితమే ఆ పని చేసి ఉండేవాళ్లమని, అలా జరిగి ఉంటే జియోలో అంతమంది సబ్‌స్క్రైబర్లు చేరి ఉండేవారు కాదన్నారు. పాతికేళ్లుగా టెలికం రంగంలో కస్టమర్లకు ఉత్తమ సేవలతో మార్కెట్లో నిలదొక్కుకున్నట్లు తెలిపింది. టెలికం సేవలకు అంతరాయం కలిగించడాన్ని కూడా ఖండిస్తున్నామని పేర్కొంది.


Click it and Unblock the Notifications