వేదాంతు..ఎంత పని చేసింది: ఒకేసారి వందల మంది ఉద్యోగులు తొలగింపు
బెంగళూరు: ఆన్‌లైన్ ఎడ్‌టెక్ ప్లాట్‌ఫామ్ వేదాంతు.. సంచలన నిర్ణయం తీసుకుంది. ఉన్నఫళంగా పలువురు ఉద్యోగులను తొలగించింది. మొత్తం ఉద్యోగుల సంఖ్యలో ఏడుశాతం వరకు కోత పెట్టింది. ఉద్యోగుల తొలగింపు విషయాన్ని వేదాంతు టాప్ మేనేజ్‌మెంట్ ధృవీకరించింది. సంస్థ ఆర్థిక పరిస్థితులు, ఇతర పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది. ఇలాంటి గడ్డు రోజులు మళ్లీ రాకూడదని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించింది.
బెంగళూరు ప్రధానకేంద్రంగా దేశవ్యాప్తంగా కార్యకలాపాలను సాగిస్తోన్న ఎడ్‌టెక్ ప్లాట్‌ఫామ్.. వేదాంతు. మొత్తంగా 5,900 మంది ఉద్యోగులు ఇందులో వేర్వేరు హోదాల్లో పని చేస్తోన్నారు. 2014లో ఈ కంపెనీ ఏర్పాటైంది. వంశీకృష్ణ, పులకిత్ జైన్, సౌరభ్ సక్సేనా, ఆనంద్ ప్రకాష్ దీన్ని నెలకొల్పారు. ఆన్‌లైన్ ద్వారా ట్యూటోరియల్స్ అందించడం- ఈ ప్లాట్‌ఫామ్ ప్రధాన ఉద్దేశం. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన సమయంలో పెద్ద ఎత్తున విద్యార్థులను ఆకట్టుకుంది.

అంతా సవ్యంగా సాగుతుందనుకున్న దశలో ఏకంగా 424 మంది ఉద్యోగులను తొలగించడం కలకలం రేపింది. ఒక్కసారిగా వారందరినీ తొలగించాల్సి రావడం పట్ల సీఈఓ వంశీకృష్ణ వివరణ ఇచ్చారు. ఏ ఒక్క ఉద్యోగిని కూడా తొలగించాలనేది తమ అభిమతం కాదని, అయినప్పటికీ- సంస్థ పరిస్థితులు, ఇతర కారణాల వల్ల కొంతమేర ఖర్చును కుదించుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. కొంతకాలంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నామని, ఇలాంటి రోజులు మళ్లీ రాకూడదని కోరుకుంటున్నానని అన్నారు.
ఈ మేరకు ఆయన సంస్థ ఉద్యోగులకు ఇమెయిల్ సందేశాన్ని పంపించారు. ఆర్థిక మాంద్యం తరహా పరిణామాలు సంభవించే అవకాశం ఉందనే కారణంతోనే వేదాంతు ఈ నిర్ణయం తీసుకుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కరోనా వైరస్ తీవ్రత తగ్గిన తరువాత పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు పునఃప్రారంభం కావడం కూడా ఆన్‌లైన్ ఎడ్‌టెక్ ప్లాట్‌ఫామ్స్‌కు కొంత ప్రతికూలంగా మారిందని, భౌతికంగా తరగతులకు హాజరవుతున్నందున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాఠాలను వినడానికి ఆసక్తి చూపట్లేదని అంచనాలు ఉన్నాయి.
తొలగించిన 424 మంది ఉద్యోగులకు ఆగస్టు 5వ తేదీ వరకు హెల్త్ బెనిఫిట్స్‌ను సంస్థ భరిస్తుందని మేనేజ్‌మెంట్ హామీ ఇచ్చింది. కొత్త ఉద్యోగాల్లో చేరడానికి అనుకూలంగా వారికి సహకరిస్తామని వివరించింది.


Click it and Unblock the Notifications