ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం వేదాంత గ్రూప్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని పునర్వ్యవస్థీకరించే దిశలొ భాగంగా కీలక అడుగులు వేస్తోంది. వేదాంత ఛైర్మన్ అనిల్ అగర్వాల్ ఫైనాన్షియల్ టైమ్స్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూ ప్రకారం.. వచ్చే నెల ప్రారంభంలో ఈ దిగ్గజ సంస్థ ఐదు వేర్వేరు లిస్టెడ్ కంపెనీలుగా విడిపోనుంది. ఏళ్ల తరబడి కొనసాగుతున్న అప్పుల భారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా ఈ భారీ విభజన ప్రక్రియను చేపడుతున్నారు. చమురు నుంచి లోహాల వరకు విస్తరించి ఉన్న ఈ గ్రూప్ కార్యకలాపాలను విడదీయడం ద్వారా వ్యాపార సామర్థ్యాన్ని పెంచాలని యాజమాన్యం భావిస్తోంది.
ఈ విభజన ప్రణాళికకు గతేడాది డిసెంబర్‌లోనే ఒక ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఆమోదం తెలిపింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత.. ప్రధాన సంస్థ వేదాంత లిమిటెడ్ పేరుతోనే కొనసాగుతుంది, దీనిలో ప్రధానంగా బేస్ మెటల్స్ వ్యాపారం ఉంటుంది. మిగిలిన నాలుగు విభాగాలు స్వతంత్ర కంపెనీలుగా ఏర్పడతాయి.

అవి:
1. వేదాంత అల్యూమినియం
2. తల్వండి సాబో పవర్
3. వేదాంత స్టీల్ & ఐరన్
4. మాల్కో ఎనర్జీ
ఈ ఐదు కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్, గ్రూప్ యొక్క ప్రస్తుత విలువైన 27 బిలియన్ డాలర్లను మించిపోతుందని అనిల్ అగర్వాల్ ధీమా వ్యక్తం చేశారు. అనిల్ అగర్వాల్ నియంత్రణలో ఉండే ఒక ప్రైవేట్ మాతృ సంస్థ (Parent Entity).. కొత్తగా ఏర్పడే ఈ ఐదు సంస్థలలో ప్రతి దానిలో సుమారు సగం వాటాలను కలిగి ఉంటుంది. దీనివల్ల గ్రూప్ మేనేజ్‌మెంట్, పెట్టుబడిదారుల మధ్య పారదర్శకత పెరుగుతుందని భావిస్తున్నారు.
వాస్తవానికి ఈ విభజన ప్రణాళికను 2023లోనే తొలిసారిగా వెల్లడించారు. అయితే, కేంద్ర ప్రభుత్వం దీనిపై కొంత ఆందోళన వ్యక్తం చేసింది. కంపెనీ విభజన జరిగితే.. తమకు రావాల్సిన బకాయిల వసూలుకు ఆటంకం కలగవచ్చని ప్రభుత్వం తొలుత భయపడింది. కానీ, ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఆమోదంతో ఇప్పుడు ఈ ప్రక్రియ వేగవంతమైంది. వేదాంత చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) అజయ్ గోయల్ గతంలో తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నాలుగు డీమెర్జ్ యూనిట్లను మే నెల మధ్య నాటికి భారతీయ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ వ్యూహాత్మక మార్పు ద్వారా Vedanta గ్రూప్ తన రుణ భారాన్ని తగ్గించుకోవడమే కాకుండా, ప్రతి వ్యాపార విభాగం స్వతంత్రంగా వృద్ధి చెందేందుకు అవకాశం కల్పిస్తోంది. పెట్టుబడిదారులు తమకు నచ్చిన నిర్దిష్ట లోహ లేదా ఇంధన విభాగంలో నేరుగా పెట్టుబడి పెట్టే వీలు కలగడం ఈ విభజనలో మరో విశేషంగా చెప్పుకోవచ్చు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications