దేశంలో రెండో అతిపెద్ద రిటైల్ ఇంధన సంస్థ,మహారత్న కంపెనీ భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్)లో ప్రభుత్వ వాటా కొనుగోలుకు వేదాంత గ్రూప్ ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) పత్రాన్ని దాఖలు చేసింది. ఇప్పటికే ఉన్న వేదాంత చమురు,గ్యాస్ వ్యాపారాల విస్తరణకు బీపీసీఎల్ మరింత దోహదపడుతుందని ఆ సంస్థ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.
బీపీసీఎల్‌లో కేంద్ర ప్రభుత్వానికి 52.98శాతం వాటా ఉంది. ప్రస్తుతం తీవ్రమైన నిధుల కొరత ఎదుర్కొంటున్న ప్రభుత్వం... పలు ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం ద్వారా నిధులను సమకూర్చుకుంటోంది. ఇందులో భాగంగానే బీపీసీఎల్ వాటాను అమ్మకానికి పెట్టింది. నవంబర్ 16వ తేదీతో బీపీసీఎల్ బిడ్డింగ్‌కి ఈవోఐ ప్రక్రియ ముగిసింది. బీపీసీఎల్‌లో వాటా ఉపసంహరణ ద్వారా దేశీయ ఇంధన రంగంలో పోటీకి అవకాశం కల్పించినట్లవుతుందని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్),బీపీసీఎల్ కంపెనీలు దేశీయ ఇంధన రంగంలో అగ్రస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.

ప్రైవేటీకరణ లేదా పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఆయా పీఎస్‌యుల నుంచి పూర్తిగా తప్పుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నది. తద్వారా ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.1.2 లక్షల కోట్లు లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థలలో వాటా ఉపసంహరణ ద్వారా మరో రూ. 90 వేల కోట్లు లక్ష్యంగా పెట్టుకుంది. ఎయిర్ ఇండియా, ఎన్టీపీసీ, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, భారత్ ఎర్త్ మూవర్స్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా తదితర కంపెనీల్లో పెట్టుబడుల ఉపసంహరణకు నీతి ఆయోగ్ ఇప్పటికే కేంద్రానికి సిఫారసులు చేసింది.


Click it and Unblock the Notifications