Vedanta share: క్షీణిస్తున్న వేదాంత షేర్ ధర.. భారీ అప్పు వేటలో అనిల్ అగర్వాల్..!
Vedanta share: ప్రస్తుతం దేశంలోని చాలా కంపెనీలు తమ అప్పుల భారాన్ని తగ్గించుకోవడం కోసం సతమతమవుతున్నాయి. ఇటీవల అదానీ గ్రూప్ కంపెనీల విషయంలోనూ ఇన్వెస్టర్లు ఆందోళన చెందటానికి వెనుక అసలు కారణం కూడా అధిక రుణాలే. ఈ విషయంలో చాలా తెలివిగా ప్రవర్తించింది మాత్రం రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అనే చెప్పుకోవాలి.

వేదాంత షేర్..
వరుసగా 8 ట్రేడింగ్ సెషన్ల నుంచి వేదాంత లిమిటెడ్ షేర్లు ఎరుపు రంగులోనే ఉన్నాయి. రానున్న కాలంలో గ్రూప్ 2 బిలియన్ డాలర్ల నిధులను సేకరించటం ప్రారంభం కానుందనే అంచనాల తరుణంలో స్టాక్ ఈ రోజు ఏకంగా 9 శాతం క్షీణించింది. ఇది సెప్టెంబర్ 16, 2022 తర్వాత షేర్ల ధరలో అతిపెద్ద పతనం.

స్టాక్ ట్రేడింగ్..
మధ్యాహ్నం 1.41 గంటల సమయంలో స్టాక్ 5.24 శాతం నష్టంలో రూ.272.30 ధర వద్ద ట్రేడవుతోంది. ఉదయం ట్రేడింగ్ సెషన్లో స్టాక్ ఐదు నెలల కనిష్ఠ ధర అయిన రూ.262ను తాకింది. గత ఎనిమిది రోజులుగా స్టాక్ ధర ఏకంగా 15 శాతం క్షీణించింది. 2023లో ఇప్పటి వరకు స్టాక్ ఏకంగా 13 శాతం వరకు క్షీణించింది.

రేటింగ్ సంస్థ ఏమందంటే..
గ్లోబల్ రేటింగ్స్ సంస్థ S&P మైనింగ్ బిలియనీర్ అనిల్ అగర్వాల్ నేతృత్వంలోని వేదాంత రిసోర్సెస్ గురించి ఒక నివేదికలో పేర్కొంది. సమీప భవిష్యత్తులో కంపెనీ 2 బిలియన్ డాలర్ల నిధులను సేకరించాలని చూస్తోందని అందులో తెలిపింది. దీనికోసం కంపెనీ ఇటీవల తన అంతర్జాతీయ జింక్ ఆస్తులను హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ విక్రయించాలని యోచిస్తోంది. అయితే దీనికి భారత ప్రభుత్వం అంగీకరించలేదు. కేంద్రం మోకాలు అడ్డుపెడితే కంపెనీ క్రెడిట్ రేటింగ్ వెంటనే ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుందని రేటింగ్ సంస్థ స్పష్టం చేసింది.

కేంద్రం వాటాలు..
దాదాపు 20 ఏళ్ల కిందట ప్రైవేటీకరించబడిన హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ కంపెనీలో కేంద్ర ప్రభుత్వానికి దాదాపు 29.54 శాతం వాటా ఉంది. అందువల్ల వేదాంత రిసోర్సెస్ తన ఆస్తులను విక్రయించాలనే ప్లాన్ కు ప్రభుత్వం అనుకూలంగా లేదు. ఆస్తుల మదింపుతో సహా ప్రభుత్వం అనేక ఆందోళనలను లేవనెత్తింది. ఈ ఆస్తులను వేదాంత రిసోర్సెస్ దాదాపు 3 బిలియన్ డాలర్లకు విక్రయించాలని చూస్తోంది.

కట్టాల్సిన అప్పులు..
కంపెనీకి జూలై-సెప్టెంబర్ మధ్య కేవలం 15 మిలియన్ డాలర్ల రుణ మెచ్యూరిటీలను కలిగి ఉంది. ఈ క్రమంలో కంపెనీ నిధులను అవసరమైన మేరకు సమీకరించకపోతో చెల్లింపుల తర్వాత నగదు కొరతను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. డిసెంబరు 31, 2023తో ముగిసే త్రైమాసికంలో 500 మిలియన్ డాలర్ల రుణ చెల్లింపులు, జనవరి 2024లో చెల్లించాల్సిన 1 బిలియన్ డాలర్ల బాండ్ చెల్లింపులు కంపెనీ ముందు ప్రస్తుతం ఉన్నాయి. మూడేళ్ల కాలంలో 4 బిలియన్ డాలర్ల రుణాన్ని తగ్గించుకునేందుకు నిబద్ధతతో ముందుకు సాగుతోందని సమాచారం.


Click it and Unblock the Notifications