Vedanta: ఖనిజాల వ్యాపారంలో అపారమైన అనుభవం కలిగిన కంపెనీ వేదాంత. అందుకే వేదాంత యజమాని అనిల్ అగర్వాల్ ఇప్పటికీ ఆ వ్యాపారంలో మైనింగ్ కింగ్ పేరును కొనసాగిస్తున్నారు. ఇటీవల ఆయన చిప్ తయారీ రంగంపై కూడా దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే.
గోవాలోని ఇనుప ఖనిజానికి నిర్వహించిన వేలంలో వేదాంత లిమిటెడ్ "ప్రాధాన్యమైన బిడ్డర్"గా ప్రకటించబడినట్లు కంపెనీ శనివారం వెల్లడించింది. రాష్ట్రంలోని ఇనుప ఖనిజం గనులకు సంబంధించి మైనింగ్ లీజు మంజూరు కోసం ఎలక్ట్రానిక్ వేలంలో పాల్గొనేందుకు గోవా ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించినట్లు కంపెనీ రెగ్యులేటరీ ప్రకటనలో తెలిపింది.

గోవా గవర్నమెంట్ ఆఫ్ మైన్స్ & జియాలజీ డైరెక్టరేట్ జారీ చేసిన జూన్ 9,2023 నాటి నోటీసు ప్రకారం.. అత్యధిక ఫైనల్ బిడ్డింగ్ ఆధారంగా బ్లాక్ VII- కుడ్నెమ్ మినరల్ బ్లాక్ ఎలక్ట్రానిక్ వేలానికి సంబంధించి కంపెనీని 'ప్రాధాన్య బిడ్డర్'గా ప్రకటించారు. దీనికోసం ధర ఆఫర్ 93.15 శాతంగా ఉంది. గోవా ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ లీజు అవసరమైన చెల్లింపులు చేయడం, టెండర్ డాక్యుమెంట్ నిబంధనలు, షరతులను పూర్తి చేయడం వంటి వాటికి లోబడి ఉంటుందని వేదాంత లిమిటెడ్ స్పష్టం చేసింది.
ఇనుము తయారీకి కీలకమైన ఖనిజాన్ని దక్కించుకోవటం కంపెనీకి రానున్న కాలంలో మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం నిర్మాణ రంగం వేగంగా వృద్ధి చెందుతున్న తరుణంలో కీలక ముడిపదార్ధంగా ఉన్న ఇనుముకు మంచి డిమాండ్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది వేదాంత షేర్లపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుందని తెలుస్తోంది. శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి వేదాంత షేర్ ధర ఎన్ఎస్ఈలో రూ. 276.80గా ఉంది.


Click it and Unblock the Notifications