Vedanta: ప్రపంచ వ్యాపారాన్ని గుప్పిటపట్టే ప్లాన్.. 30 కంపెనీలతో అనిల్ అగర్వాల్ ఒప్పందాలు..
Vedanta: చిప్ తయారీలో దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ముందడుగు వేసిన మెుదటి వ్యాపారవేత్త అనిల్ అగర్వాల్. ఈయన తర్వాత టాటా గ్రూప్ సైతం సెమీకండక్టర్ల వ్యాపారంలోకి ప్రవేసించాలని నిర్ణయించినట్లు ఇటీవల వెల్లడించింది. అయితే దేశంలో సెమీకండక్టర్లు, డిస్ప్లే గ్లాస్ తయారీ కోసం సుమారు 30 జపాన్ కంపెనీలతో వేదాంత గ్రూప్ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇది వ్యాపార రంగంలో పెద్ద చర్చకు దారితీసింది.

భారత్ కేంద్రంగా..
జపాన్ రాజధాని టోక్యో నగరంలో జరిగిన వేదాంత-అవాన్‌స్ట్రేట్ బిజినెస్ పార్టనర్స్ సమ్మిట్ 2022లో వేదాంత దాదాపు 30 జపాన్ టెక్నాలజీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఎలక్ట్రానిక్స్ తయారీకి కేంద్రంగా మార్చేందుకు వేదాంత కట్టుబడి ఉంది. ఈ రంగంలో అనేక ఉత్పత్తులను దేశంలోనే తయారు చేసి.. దేశంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లకు కూడా ఎగుమతి చేయాలని వేదాంతా గ్రూప్ లక్ష్యంగా పనిచేస్తోంది.

వేదాంత మాట..
ఒప్పందాల ద్వారా సాంకేతికత బదిలీ కంటే ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ పర్యావరణ వ్యవస్థ అభివృద్ధిని వేదాంత ముఖ్యమైనదిగా చూస్తున్నట్లు వేదాంత గ్లోబల్‌కు చెందిన డిస్‌ప్లే అండ్ సెమీకండక్టర్ బిజినెస్ యూనిట్ మేనేజింగ్ డైరెక్టర్ అగర్ష్ కె హెప్పర్ వెల్లడించారు. వేదాంత గ్రూప్ ప్రస్తుతం మైనింగ్ రంగంలో అతిపెద్ద కంపెనీగా గుర్తింపు పొందింది. గ్రూప్ ఇండియాతో పాటు సౌత్ ఆఫ్రికా, నమీబియా అంతటా వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తూ ప్రపంచంలోని ప్రముఖ చమురు, గ్యాస్ అండ్ మెటల్ కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతోంది.

ఫాక్స్ కాన్ ఒప్పందం..
అనిల్ అగర్వాల్ కొన్ని నెలల క్రితం తైవాన్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు పాక్స్‌కాన్‌తో భారతదేశంలో సెమీకండక్టర్ చిప్‌లను తయారు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో ఈ 20 బిలియన్ డాలర్ల చిప్ ఫ్యాక్టరీని ఏర్పాటుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఫాక్స్ కాన్ ఇప్పటికే చెన్నైలో అతిపెద్ద ఫ్యాక్టరీ నిర్మాణాన్ని కలిగి ఉంది. మహారాష్ట్రకు వెళ్లాల్సిన ప్రాజెక్ట్ గుజరాత్ కు వెళ్లటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.

లక్షల కోట్ల ప్రాజెక్ట్..
వేదాంత-ఫాక్స్ కాన్ సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న సెమీకండక్టర్ చిప్ ఫ్యాక్టరీని సుమారు 1000 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఇందుకోసం దాదాపు రూ.1.54 లక్షల కోట్లను రెండు కంపెనీలు ఇన్వెస్ట్ చేయనున్నాయి. ఈ ఫ్యాక్టరీ కోసం గుజరాత్ భూమిని 99 ఏళ్లపాటు ఉచితంగా లీజుకు ఇచ్చినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications