IPO News: లాభాల దుమ్మురేపిన జ్యువెలరీ ఐపీవో..కానీ లిస్టింగ్ తర్వాత కుప్పకూలిన..
Varyaa Creations IPO: నెల చివరి రోజున దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐపీవోల లాభాల కోలాహలం కొనసాగుతోంది. వరుసగా వచ్చిన మూడో ఐపీవో సైతం ఇన్వెస్టర్లను లాభాల మత్తులో ముంచేసింది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది జ్యువెలరీ పరిశ్రమకు చెందిన వర్యా క్రియేషన్స్ ఐపీవో గురించే. కంపెనీ షేర్లు నేడు మార్కెట్లో దాదాపు 90 శాతం ప్రీమియం రేటుతో బంపర్ లిస్టింగ్ నమోదు చేసింది. లాభకరమైన జాబితా తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మెుగ్గుచూపటంతో స్టాక్ 5 శాతం లోయర్ సర్క్యూట్ తాకింది.

వర్యా క్రియేషన్స్ షేర్లు ఐపీవో జాబితా సమయంలో ఒక్కొక్కటి రూ.285 రేటు వద్ద జాబితా చేయబడ్డాయి. ఇది వాస్తవ ఇష్యూ ధర రూ.150 కంటే 90% అధికం. కంపెనీ ఐపీవో ఇష్యూ 22 ఏప్రిల్‌న ప్రారంభమై ఏప్రిల్ 25న ముగిసింది. కంపెనీ ఇన్వెస్టర్ల కోసం లాట్ పరిమాణాన్ని 1,000 షేర్లుగా నిర్ణయించింది. వర్యా క్రియేషన్స్ తాజా ఐపీవో ద్వారా మార్కెట్ల నుంచి రూ.20.10 కోట్లను సమీకరించింది. ఈ క్రమంలో కంపెనీ 13.40 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయించింది. ఐపీవో ద్వారా సేకరించిన మెుత్తాన్ని కొత్త షోరూమ్స్ ఏర్పాటు, వాటి ఇన్వెంటరీ కొనుగోలు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించాలని ప్లాన్ చేస్తోంది.
వర్యా క్రియేషన్స్ కంపెనీ వాస్తవానికి బంగారం, వెండి, ఇతర లోహాలతో పాటు విలువైన రాళ్ల వ్యాపారం చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆభరణాల తయారీ, బ్రాండింగ్‌పై దృష్టి పెట్టాలని కంపెనీ భావిస్తోంది. కంపెనీ ప్రధానంగా ముంబైలో తన ఆభరణాలను ఉత్పత్తి చేస్తోంది. కంపెనీ ప్రమోటర్లు సారిక, పూజా నహేతా జ్యువెలరీ, స్టోన్ పరిశ్రమలో 20 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నారు.


Click it and Unblock the Notifications