కరోనా మహమ్మారిని నివారించే వ్యాక్సీన్‌ను తయారు చేసేందుకు చాలా సమయం పడుతుందని, అలాగే ఆరోగ్య సంరక్షణలో పెట్టుబడులు మరింతగా పెరగాలని బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్ పర్సన్ కిరణ్ మజుందార్ షా అన్నారు. కార్ప్‌గిని నిర్వహించిన 'ఫార్మా అండ్ హెల్త్‌కేర్స్ న్యూ నార్మల్: ఎంగేజింగ్ విత్ కస్టమర్స్ ఇన్ అన్‌సెర్టయిన్ టైమ్స్, బిజినెస్ మోడల్ పోస్ట్ కోవిడ్ 19'లో (ఫార్మా-హెల్త్ కేర్ రంగాలు, అనిశ్చిత పరిస్థితుల్లో వినియోగదారులతో మమేకం, కొవిడ్-19 అనంతర వ్యాపార విధానం) వెబినార్ ద్వారా మాట్లాడారు.

ఏడాదిలో కష్టం.. నాలుగేళ్లు పట్టవచ్చు
మొత్తం దేశానికి ఉపయోగపడే సురక్షితమైన వ్యాక్సీన్ తీసుకు రావడానికి చాలా సమయం పడుతుందని మజుందార్ షా అన్నారు. టీకా అభివృద్ధి చాలా క్లిష్టమైన ప్రక్రియ అని మనం గుర్తించాల్సి ఉందన్నారు. ఈ టీకా కోసం కనీసం నాలుగు సంవత్సరాల సమయం పడుతుందని చెప్పారు. కేవలం ఏడాదిలోపు వ్యాక్సీన్ అభివృద్ధి చేయడం చాలా కష్టమైన పని అన్నారు. ఇది అసాధ్యం కూడా కావొచ్చునని చెప్పారు. ఎందుకంటే వ్యాక్సీన్ తయారీలో భద్రత, ఓర్పు, సమర్థతతో కూడిన ఎన్నో ప్రక్రియలు ఉంటాయన్నారు.

పెట్టుబడుల అవసరం ఉంది
కరోనా మహమ్మారితో మరికొన్నేళ్లు పోరాడక తప్పదని మజుందార్ షా అన్నారు. హెల్త్‌కేర్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడుల అవసరం ఉందన్నారు. ఆరోగ్య సంరక్షణలో పెట్టుబడులకు మంచి అవకాశమని, ఎందుకంటే ఇది దేశాన్ని, ప్రపంచాన్ని కాపాడుతుందన్నారు. కరోనా వైరస్ నియంత్రణ వ్యాక్సిన్ రావడానికి చాలాకాలమే పడుతుందని మనం నమ్మాలని, ఇది యావత్ దేశానికి ఇది అందుబాటులోకి రావాలంటే మరెంతో సమయం కావాలన్నారు. కరోనా వ్యాప్తిని ఎదుర్కోవడానికి, ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు క్రమబద్దమైన డేటా అవసరమన్నారు.

కరోనా తెలిపింది.. అపోలో సునితా రెడ్డి
అపోలో హాస్పిటల్స్ ఎండీ సునితా రెడ్డి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. వైద్య వసతులను మెరుగుపరుచుకోవాలన్నారు. ఆరోగ్య సంరక్షణలో పెట్టుబడులు పెరగాలని, కేవలం మౌలిక వసతుల్లోనే కాకుండా నైపుణ్యాభివృద్ధిలోను పెట్టుబడులు పెంచాలన్నారు. వైద్య రంగంలో మౌలిక సదుపాయాల కొరతను కరోనా స్పష్టంగా తెలియజేసిందన్నారు.

ఐటీ రంగం తర్వాత..
దేశంలో ఐటీ రంగం అభివృద్ధికి ఎలాంటి ప్రేరణను ఇస్తున్నారో అలాగే హెల్త్ కేర్ రంగంలో అదనపు మౌలిక వసతుల కల్పనకు కూడా పెద్దపీట వేయాలని సునితా రెడ్డి అన్నారు. తదుపరి ఐటీ రంగంగా హెల్త్ కేర్‌ను ప్రభుత్వాలు భావిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications