మిత్రదేశం ముసుగులో గోతులు తవ్వుతున్న అమెరికా.. భారత్ నిర్ణయంపై ఘాటు వ్యాఖ్యలు
India Imports: భారత్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని కొన్ని దేశాలు పనిగట్టుకుని మరీ వివాదాస్పదం చేస్తున్నాయి. మిత్రదేశంగా చెప్పుకునే అగ్రరాజ్యం అమెరికా ఈ విషయంలో ముందుంటోంది. ఏకంగా అంతర్జాతీయ వేదికపై ఇండియా వైఖరిని తప్పుపట్టింది.
ల్యాప్ టాప్‌లు, ట్యాబ్లెట్లు సహా పలు ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దిగుమతులపై భారత ప్రభుత్వం పరిమితిని విధించింది. ఈ నిర్ణయంపై ఆపిల్, శామ్ సంగ్ వంటి దిగ్గజ కంపెనీలు సైతం స్పందించాయి. దీనిని పునః పరిశీలించాలని అభ్యర్థించాయి. అయితే తాజాగా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్(WTO)వద్ద మార్కెట్ యాక్సెస్‌పై జరిగిన సమావేశంలో అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది.

చైనా, తైవాన్‌ను దృష్టిలో పెట్టుకుని భారత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అగ్రరాజ్యం ప్రతినిధి ఆరోపించారు. ఇండియాతో వ్యాపారం చేయడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని తమ సంస్థలకు సూచించేలా ఈ చర్యలు ఉన్నాయన్నారు. తద్వారా మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో భారీగా ఉద్యోగాలు సృష్టించాలనే భారత్ ఆశయం కష్టతరం అవుతుందన్నారు. ఇండియా ఎగుమతులపైనా దీని ప్రభావం ఉంటుందని స్పష్టం చేశారు.
దేశీయంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీని పెంచి, చైనా వంటి ఇతర ప్రాంతాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని భారత్ ఆగస్టులో వాటిపై ఆంక్షలు విధించింది. దిగుమతులపై నిర్ధిష్టమైన షరతులు, భద్రతతో కూడిన లైసెన్సింగ్ వ్యవస్థను అమల్లోకి తీసుకురావాలని యోచిస్తోంది. నవంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు సైతం అమల్లోకి రానున్నాయి.
పాలసీ మార్పులు సహా భారత్ తాజా విధానం వెనకున్న ఉద్దేశ్యాన్ని స్పష్టం చేయాలని చైనా కోరింది. ఈ చర్యలు WTO నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, అంతర్జాతీయ వాణిజ్య విపణిలో అనవసర అడ్డంకులు ఏర్పడే ప్రమాదం ఉందని దక్షిణ కొరియా ఆందోళన వ్యక్తం చేసింది. భారత్ తన నిర్ణయాన్ని మరోసారి పరిశీలించాలని, సమస్యపై వివరణాత్మక సమాచారం అందించాలని అభ్యర్థించింది.


Click it and Unblock the Notifications