చైనా టార్గెట్‌గా వెనిజువెలాపై అమెరికా దాడి.. దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగులోకి.. ట్రంప్ దెబ్బ అదుర్స్..
అమెరికా సైన్యం అకస్మాత్తుగా వెనిజులాపై సైనిక చర్య చేపట్టిన సంగతి విదితమే. అధ్యక్షుడు నికోలస్ మదురోతో పాటు ఆయన భార్యను అరెస్టు చేసి దేశం వెలుపలికి తరలించింది. ఈ ఘటన ప్రపంచ రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. అమెరికా-వెనిజువేలా మధ్య ఉద్రిక్తతలు ఏళ్లుగా కొనసాగుతున్నప్పటికీ.. ఈ స్థాయి దాడి ఎందుకు జరిగిందన్న ప్రశ్న ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చకు తెరలేచింది. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యమని అధికారికంగా చెప్పినా.. ఈ సైనిక చర్య వెనుక ఉన్న అసలు కారణం మరింత లోతైనదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
వెనిజువెలా ప్రపంచంలోనే అత్యధిక ముడి చమురు నిల్వలు కలిగిన దేశం కావడమే ఈ మొత్తం పరిణామానికి కేంద్ర బిందువుగా మారింది. ఆయిల్ అండ్ గ్యాస్ సంస్థల గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చమురు నిల్వలు సుమారు 1.73 ట్రిలియన్ బ్యారెళ్లుగా అంచనా వేయబడుతున్నాయి. ఇందులో వెనిజువెలాకే దాదాపు 303 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలు ఉన్నాయి. ఈ గణాంకాల ప్రకారం, సౌదీ అరేబియాను కూడా వెనక్కి నెట్టి.. వెనిజువేలా ప్రపంచంలోనే అతిపెద్ద ముడి చమురు నిల్వలు కలిగిన దేశంగా నిలుస్తోంది.

1970ల దాకా వెనిజువేలా చమురు ఉత్పత్తి, ఎగుమతుల్లో అగ్రగామిగా ఉండేది. అయితే, కమ్యూనిస్టు భావజాలం బలపడిన తర్వాత అక్కడి ప్రభుత్వం చమురు రంగాన్ని పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంది. ప్రైవేట్ యాజమాన్యంలోని చమురు కంపెనీలను జాతీయీకరించడం వల్ల అమెరికా చమురు సంస్థలకు Venezuela వనరులపై ప్రవేశం పూర్తిగా మూసుకుపోయింది. ఈ పరిణామం అమెరికా-వెనిజువెలా సంబంధాలను తీవ్రంగా దెబ్బతీసింది.
ఈ నేపథ్యంలోనే అమెరికా వెనిజువేలాపై పలు ఆర్థిక ఆంక్షలు విధించింది.ఈ ఆంక్షల కారణంగా వెనిజువేలా తన చమురు శుద్ధి వ్యవస్థలను ఆధునీకరించలేకపోయింది. ఫలితంగా అపారమైన చమురు నిల్వలు ఉన్నప్పటికీ.. వాటిని ఆదాయంగా మలచుకోవడంలో దేశం తీవ్రంగా విఫలమైంది. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని చైనా ఎంట్రీ ఇచ్చింది. వెనిజువేలాకు భారీగా రుణాలు, ఆర్థిక సహాయం అందిస్తూ.. బదులుగా ముడి చమురు సరఫరా ఒప్పందాలు కుదుర్చుకుంది. ప్రస్తుతం చైనాకు భారీగా అప్పులు ఉన్న దేశాల్లో వెనిజువేలా ఒకటిగా మారింది.
ఈ పరిణామాలన్నీ అమెరికాకు వ్యూహాత్మకంగా పెద్ద సవాలుగా మారాయి. వెనిజువేలా చమురు వనరులు చైనా ప్రభావంలోకి వెళ్తే, ప్రపంచవ్యాప్తంగా చైనా ఆర్థిక, భౌగోళిక శక్తి మరింత పెరుగుతుందన్న ఆందోళన వాషింగ్టన్‌లో నెలకొంది. ఈ నేపథ్యంలోనే.. ట్రంప్ ప్రభుత్వం వేగంగా చర్యకు దిగిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మదురో ప్రభుత్వాన్ని తొలగించడం ద్వారా ఒకవైపు చైనా ప్రభావాన్ని తగ్గించడం, మరో వైపు వెనిజువేలా చమురు వనరులపై పట్టు సాధించడం అమెరికా లక్ష్యాలుగా కనిపిస్తున్నాయి.
వెనిజువేలాపై దాడి అనంతరం ట్రంప్ ఇచ్చిన ఇంటర్వ్యూలలో మాదక ద్రవ్యాల అంశం కంటే చమురు వనరుల గురించే ఎక్కువగా ప్రస్తావించడం ఈ వాదనకు బలం ఇస్తోంది. అమెరికాకు ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి మౌలిక సదుపాయాలు ఉన్నాయని, వాటి సహాయంతో వెనిజువేలా రిఫైనరీలను పునరుద్ధరిస్తామని ట్రంప్ పేర్కొన్నారు. దీంతో చమురు ఉత్పత్తి, ఎగుమతులు భారీగా పెరుగుతాయని ఆయన చెప్పారు.
ఈ సైనిక చర్య ప్రభావం అమెరికా స్టాక్ మార్కెట్‌లో వెంటనే కనిపించింది. దాడి అనంతరం అమెరికా చమురు కంపెనీల షేర్లు 11 శాతం కంటే ఎక్కువగా పెరిగాయి. చెవ్రాన్, వాలెరో, EOG రిసోర్సెస్ వంటి దిగ్గజ కంపెనీలు ఇప్పటికే 100 బిలియన్ డాలర్లకు పైగా మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను కలిగి ఉన్నాయి. వెనిజువేలా చమురు వనరులు త్వరలో తమకు అందుబాటులోకి వస్తాయన్న అంచనాలే ఈ షేర్ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా మారాయి.
క్లుప్తంగా చెప్పాలంటే వెనిజువేలాపై అమెరికా సైనిక చర్య కేవలం రాజకీయపరమైన నిర్ణయం కాదు. ఇది చమురు, శక్తి వనరులు, చైనా-అమెరికా పోటీ వంటి అంశాలతో ముడిపడిన వ్యూహాత్మక దాడిగా ప్రపంచం చూస్తోంది. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లను ఎలా ప్రభావితం చేస్తాయో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications