Layoff News: ప్రపంచ టెక్ దిగ్గజాల్లో ఒకటిగా ఉన్న గూగుల్ పెద్ద షాక్ ఇచ్చేందుకు సిద్ధమౌతోంది. అసలు దీనికంతటి కారణం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విరివిగా వినియోగించాలని కంపెనీ నిర్ణయించటమేనని తెలుస్తోంది.
గత ఏడాది గూగుల్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 12,000 మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కోతలు కొత్త ఏడాది 2024లో కూడా కొనసాగుతాయని తెలుస్తోంది. అవును ఆల్ఫాబెట్ యాజమాన్యంలోని గూగుల్ మానవ వనరలు రీఆర్గనైజేషన్ కార్యక్రమంలో భాగంగా రానున్న కాలంలో 30,000 మందిని తొలగించవచ్చని తెలుస్తోంది. అయితే వీరందరూ కంపెనీలోని యాడ్ సేల్స్ విభాగానికి చెందిన వారుగా ఉండనున్నారు.

ఈ వివరాలు తెలిసిన వ్యక్తి ద్వారా సమాచారం గురువారం బయటకు రావటం పెద్ద గందరగోళానికి దారితీస్తోంది. అమెరికాలోని పెద్ద కస్టమర్‌లకు ప్రకటనల విక్రయాలను పర్యవేక్షిస్తున్న సీన్ డౌనీ, గత వారం జరిగిన డిపార్ట్‌మెంట్-విస్తృత సమావేశంలో యాడ్ సేల్స్ టీమ్ పునర్నిర్మించాలని గూగుల్ చూస్తున్నట్లు వెల్లడించారు. అయితే దీనిలో లేఆఫ్స్ ఉంటాయా లేదా అనే విషయాన్ని వెల్లడించలేదు. వాస్తవానికి గూగుల్ తన సెర్చ్ ఇంజన్, యూట్యూబ్, ఇతర సేవల మెరుగుదలకు మెషిన్-లెర్నింగ్ టెక్నిక్‌లపై ఎక్కువగా ఆధారపడుతున్న తరుణంలో తాజా చర్య వచ్చింది.
అయితే దీనిపై ఇప్పటి వరకు గూగుల్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. పైగా వార్తలపై స్పందించలేదు. ఈ ఏడాది జూన్‌లో గూగుల్ యాడ్స్ టెక్నాలజీతో యాప్ అడ్వర్టైజింగ్ సిస్టమ్‌ను విలీనం చేయడంతో మ్యాపింగ్ యాప్ వేజ్‌లోని ఉద్యోగులను గూగుల్ తొలగించింది. రానున్న కాలంలో ఇతర దిగ్గజ కంపెనీల్లో సైతం ఏఐ టూల్స్ వినియోగం పెరగటం ద్వారా ఉద్యోగ అవకాశాలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు కేవలం ప్రారంభ దశలోనే ఉన్నట్లుగా వారు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications