Cognizant: భారతీయ ఐటీ కంపెనీలకు శుభవార్త.. 2025పై కాగ్నిజెంట్ కీలక ప్రకటన..
Cognizant News: చాలా త్రైమాసికాలుగా భారతీయ ఐటీ కంపెనీలు మందగమనాన్ని చూస్తున్నాయి. ద్రవ్యోల్బణంతో పాటు ప్రపంచ రాజకీయభౌగోళిక పరిస్థితులు దీనికి కారణంగా ఉన్నాయి. అయితే కొన్ని నెలలుగా పరిస్థితులు నెమ్మదిగా గాడిన పడుతున్నాయి. టెక్ కంపెనీలు సైతం వ్యాపారంలో మెరుగుదల కారణంగా ప్రాజెక్టుల పెరుగుదలను చూస్తున్నాయి.
తాజాగా అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఫిబ్రవరి 5న నాలుగవ త్రైమాసికానికి నిపుణుల అంచనాలను అధిగమించి ఉత్తమ పనితీరును కనబరిచింది. నాస్డాక్-లిస్టెడ్ ఐటీ కంపెనీ తన వార్షిక, త్రైమాసిక ఆదాయ మార్గదర్శకాలను పెంచగా.. మెరుగైన ఆదాయ వృద్ధి దృశ్యమానతను చూపింది. ఇదే క్రమంలో 2025 సంవత్సరానికి తన వృద్ధి అంచనాలను ప్రకటిస్తూ 3.5 శాతం నుంచి 6 శాతానికి పెంచింది. వాస్తవానికి మూడవ త్రైమాసిక ఫలితాల ప్రకటన సమయంలో ఇది 1.4 శాతం నుంచి 1.9 శాతం వరకు ఉంటుందని పేర్కొంది.

డిసెంబరుతో త్రైమాసికంలో డిమాండ్ వాతావరణం మెరుగుపడిందని, ఇప్పుడు స్థిరీకరణ నుండి వృద్ధికి కదులుతోందని కాగ్నిజెంట్ పేర్కొవటం భారతీయ ఐటీ సేవల కంపెనీల్లో కూడా కొత్త జోష్ నింపింది. అలాగే తాము కొంత విచక్షణతో కూడిన ఖర్చును తిరిగి పొందుతున్నట్లు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జతిన్ దలాల్ వెల్లడించారు. ఈ క్రమంలో కంపెనీ త్రైమాసిక ఆదాయం వాల్ స్ట్రీట్ నిపుణులు అంచనా వేసిన 5.06 బిలియన్ డాలర్లను అధిగమించి 5.1 బిలియన్ డాలర్లుగా నమోదు చేయటంతో ఉత్తమ పనితీరును కనబరిచింది.
ప్రధానంగా కంపెనీ హెల్త్ సైన్సెస్ వర్టికల్ నుంచి దాదాపు 10.4 శాతం వృద్ధిని సాధించింది. త్రైమాసిక కాలంలో కంపెనీ 100 మిలియన్ డాలర్ల విలువ కలిగిన దాదాపు 10 కాంట్రాక్టులను కుదుర్చుకున్నట్లు పేర్కొంది. అలాగే ఆపరేటింగ్ మార్జిన్ గత సంవత్సరంతో పోలిస్తే 40 బేసిస్ పాయింట్లు (bps) తగ్గి 14.8 శాతానికి చేరుకుంది. అయితే పూర్తి సంవత్సరం ఆపరేటింగ్ మార్జిన్ గత సంవత్సరంతో పోలిస్తే 80 బేసిస్ పాయింట్లు పెరిగి 14.7%కి చేరుకుంది. కంపెనీ ఉద్యోగుల సంఖ్య వరుసగా 3,300, క్యూ4 చివరి నాటికి మెుత్తం సంవత్సరానికి 10,700 ఉద్యోగుల తగ్గుదలను చూసింది.
కంపెనీ వ్యూహాత్మక ప్రాధాన్యతలు, కఠినమైన అమలు పట్ల ఉద్యోగులు చూపిన నిబద్ధతకు సీఈవో రవి కుమార్ కృతజ్ఞతలు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరాన్ని మంచి ఫలితాలతో ముగించినట్లు ఆయన వెల్లడించారు. సంవత్సరంలో రికార్డు స్థాయిలో 29 బిగ్ డీల్స్ క్లోజ్ చేసినట్లు చెప్పారు.


Click it and Unblock the Notifications