US Visas: భారతీయులకు అమెరికా గుడ్‌న్యూస్.. ఆ వీసాలు జారీ మరింత సులభం
అమెరికా వీసాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయులకు ఆ దేశం శుభవార్త చెప్పింది. భారత్‌లో వ్యాపార వీసాల జారీని మరింత సులభతరం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అమెరికా అంతర్జాయ మార్కెట్ల విభాగం అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ కామర్స్ అరుణ్ వెంకటరామన్ తెలిపారు. సిబ్బంది సంఖ్యను పెంచడం సహా పలు మార్పులు చేస్తున్నట్లు వెల్లడించారు. కొవిడ్ పరిస్థితుకు ముందుతో పోలిస్తే గతేడాది ఎక్కువ మొత్తంలో హెచ్1బీ మరియు ఎల్ వీసాలను జారీ చేసి గణనీయమైన పురోగతిని సాధించామన్నారు.

ఆర్థిక బంధాలు బలపరచుకుందాం..
'కొవిడ్ పరిస్థితుల కారణంగా వీసాల జారీలో సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ఏడాది మార్చిలో అమెరికా వాణిజ్య కార్యదర్శి గినా రైమోండోతో పాటు అమెరికా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల బృందం భారత్‌లో పర్యటించనుంది. భారత్-అమెరికాల సీఈవో ఫోరమ్ సహా యూఎస్-ఇండియా వాణిజ్య సమావేశంలోనూ భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో ఆయన సమావేశం కానున్నారు.
ఇండియాకు అమెరికా అతిపెద్ద ఎగుమతిదారు మరియు వాణిజ్య భాగస్వామి. ఈ సమావేశాల ద్వారా ఇరు దేశాల మధ్య ఆర్థిక బంధాలను మరింత బలపరచుకునే అవకాశం ఏర్పడుతుంది' అని వెంకటరామన్ తెలిపారు.

భారీ లక్ష్యం:
గతేడాది ఏప్రిల్-నవంబర్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 87.33 బిలియన్ డాలర్లు కాగా.. 2025 నాటికి 500 బిలియన్ డాలర్లకు తీసుకువెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అరుణ్ వెల్లడించారు. లక్ష్యం పెద్దదైనా వ్యూహాత్మక అంశాలను గుర్తించి ప్రైవేట్ రంగంతో కలిసి ఇరు దేశాలు పనిచేస్తున్నట్లు చెప్పారు. తద్వారా భవిష్యత్తులోనూ ఇబ్బందులను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

పరిష్కారం దిశగా ప్రయత్నాలు..
భారతీయ ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై అదనపు సుంకాల సమస్య నివారణకు వాణిజ్య భాగస్వాములందరితో కలిసి పని చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సమస్య మూలాలను కనుగొని పరిష్కరిస్తేనే తప్పు మరింత స్వేచ్ఛా వాణిజ్యం దిశగా ముందుకు సాగలేమన్నారు.


Click it and Unblock the Notifications