డొనాల్డ్ ట్రంప్‌కు కరోనా పాజిటివ్, అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కరోనా మహమ్మారి సోకిందనే వార్తల నేపథ్యంలో అగ్రరాజ్యం మార్కెట్లు కుప్పకూలాయి. ట్రంప్‌తో పాటు భార్య మెలానియా ట్రంప్‌కు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ మేరకు ట్రంప్ ట్వీట్ చేశారు. దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది. ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో స్టాక్స్ నష్టాల్లోకి జారుకున్నాయి. అధ్యక్ష ఎన్నికల ప్రచారం ప్రారంభమైన తరుణంలో ట్రంప్ కరోనా బారిన పడటం రిపబ్లికన్ పార్టీని ఆందోళనకు గురి చేస్తోంది.

పెట్టుబడిదారుల్లో ఆందోళన
స్టాక్స్ 0.36 శాతం క్షీణించింది. లండన్ ఎఫ్‌టీఎస్ఈ 0.95 శాతం పడిపోయింది. జర్మనీ డాక్స్ 0.82 శాతం నష్టపోయింది. డౌ జోన్స్ ఫ్యూచర్స్, నాస్‌డాక్ ఫ్యూచర్స్, ఎస్ అండ్ పీ క్షీణించాయి. డౌజోన్స్ ఫ్యూచర్స్ ఓ సమయంలో 500 పాయింట్లు నష్టపోయింది. అయితే ఆ తర్వాత మార్కెట్లు కోలుకున్నాయి. డౌజోన్స్ 0.13 శాతం, ఎస్ అండ్ పీ 0.53 శాతం, నాస్‌డాక్ 1.42 శాతం లాభపడింది. బంగారం ధర క్షీణించింది. ఔన్స్ పసిడి కామెక్స్‌లో 1,894 డాలర్లకు పడిపోయింది. అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ట్రంప్ కరోనా బారినపడటం పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొంది.

ఆ జాబితాలో ట్రంప్
కరోనా మహమ్మారి బారిన పడిన ప్రపంచ నాయకుల జాబితాలో ట్రంప్ చేరారు. ఇదివరకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, బ్రెజిల్ అధ్యక్షులు జెయిర్ బోల్సనారోలకు వైరస్ సోకింది. తనకు వైద్యం చేసిన డాక్టర్‌కు వైరస్ పాజిటివ్ రావడంతో జర్మనీ చాన్సులర్ ఏంజెలా మోర్కెల్, భార్యకు కరోనా సోకడంతో కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో ఇంటి నుండి విధులు నిర్వర్తించారు. ఇటీవలే ట్రంప్-జోబిడెన్ మధ్య ప్రెసిడెన్షియల్ డిబెట్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే.

అస్థిరమైన ఉద్యోగ మార్కెట్
అమెరికాలో అస్థిరమైన ఉద్యోగ మార్కెట్ కారణంగా కన్స్యూమర్ స్పెండింగ్ నెమ్మదించింది. పాలకులు మరోసారి భారీ ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని లేదంటే ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల డిస్నీ, గోల్డ్‌మన్ శాక్స్ నుండి తొలగింపుల ప్రకటన ఆందోళన కలిగించింది. ఇప్పుడు ట్రేడర్స్.. లేబర్ డిపార్టుమెంట్ విడుదల చేసే ఫామ్ పేరోల్స్, నిరుద్యోగిత రేటు డేటా కోసం వేచి చూస్తున్నారు. డాలర్ మాత్రం 0.3 శాతం ఎగిసింది.


Click it and Unblock the Notifications