శాంతి ఒప్పందానికి బ్రేక్.. అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఇరాన్.. హర్ముజ్ జలసంధి వద్ద మళ్లీ యుద్ధ మేఘాలు
పశ్చిమాసియా (Mid-East) ప్రాంతంలో పరిస్థితులు మళ్లీ యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య గత వారమే కుదిరిన 60 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఇంకా అమల్లో ఉండగానే.. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు భారీగా సైనిక చర్యలకు దిగడంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన సముద్ర రవాణా మార్గమైన 'హార్ముజ్ జలసంధి' (Strait of Hormuz) సమీపంలో ప్రయాణిస్తున్న 'ఎవర్ లవ్లీ' అనే వాణిజ్య నౌకపై ఇటీవల జరిగిన డ్రోన్ దాడితో ఈ తాజా ఘర్షణలు మొదలయ్యాయి. ఈ దాడికి ఇరాన్ మద్దతు ఉన్న బలగాలే కారణమని అమెరికా తీవ్రంగా ఆరోపించింది.
కాల్పుల విరమణ నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘిస్తూ ఈ దాడి జరిగిందని పేర్కొంటూ.. అమెరికా నౌకాదళం, వైమానిక దళం ఇరాన్ తీరప్రాంత లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. ఇరాన్‌కు చెందిన క్షిపణి ప్రయోగ కేంద్రాలు, డ్రోన్ నిల్వ స్థావరాలు, రాడార్ వ్యవస్థలు, ఇతర సైనిక మౌలిక సదుపాయాలపై అమెరికా ఖచ్చితత్వంతో కూడిన వైమానిక దాడులను నిర్వహించింది. ఈ దాడులకు సంబంధించిన అధికారిక వీడియోలను అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) విడుదల చేసింది. ఈ వీడియోలలో అమెరికా యుద్ధ నౌకల నుండి వరుసగా క్షిపణులు దూసుకెళ్లడం, ఇరాన్‌లోని సైనిక స్థావరాలను తాకిన తర్వాత భారీ పేలుళ్లు సంభవించిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ సముద్ర మార్గాల భద్రతను కాపాడటానికి, తమ బలగాల రక్షణ కోసమే ఈ ముందస్తు చర్యలు చేపట్టినట్లు అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది.

అమెరికా చేపట్టిన ఈ ప్రతిచర్యపై ఇరాన్ అంతే తీవ్రంగా స్పందించింది. తమ దేశ సార్వభౌమత్వాన్ని అమెరికా ఉల్లంఘించిందని ఆరోపిస్తూ, ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రతీకార దాడులకు దిగింది. గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలు, అమెరికాకు చెందిన ఇతర ఆస్తులను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ వరుస క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లతో దాడులు చేసినట్లు ప్రకటించింది. ఈ ఇరాన్ దాడుల వల్ల జరిగిన నష్టంపై అమెరికా ఇప్పటివరకు అధికారికంగా పూర్తి వివరాలను వెల్లడించనప్పటికీ, తమ దళాలు గరిష్ట అప్రమత్తతతో ఉన్నాయని, ఏ క్షణంలోనైనా తదుపరి చర్యలకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది.
ఈ తాజా సైనిక ఘర్షణలతో గత వారం కుదిరిన 60 రోజుల తాత్కాలిక శాంతి ఒప్పందం భవిష్యత్తు పూర్తిగా ప్రశ్నార్థకంగా మారింది. హార్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతను కాపాడటం, ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా ఈ ఒప్పందం కుదిరింది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురు రవాణాలో ఈ జలసంధి అత్యంత కీలకమైనది. ఇక్కడి నుండి రోజూ లక్షల బ్యారెళ్ల ముడి చమురు వివిధ దేశాలకు రవాణా అవుతుంది. ఇప్పుడు ఇరు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిగా విఫలమై, ఇక్కడ ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరితే, అది అంతర్జాతీయంగా చమురు ధరల పెరుగుదలకు, ప్రపంచ వాణిజ్య సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.


Click it and Unblock the Notifications
