సంతకం ఇంక్ కూడా ఆరలేదు.. చైనాతో మాట్లాడాలని లేదు: ట్రంప్
ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో తనకు చైనాతో వాణిజ్య చర్చలు ఆసక్తి లేదని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. కరోనాకు ముందు మొదటి దశ చర్చలు పూర్తయ్యాయి. రెండో దశ చర్చలు జరుగుతాయని, ఫలప్రదం అవుతాయని భావిస్తున్న సమయంలో కరోనా రూపంలో ట్రేడ్ వార్‌ను పెద్దది చేసింది. ఈ నేపథ్యంలో సీపీఎస్ న్యూస్ ఇంటర్వ్యూలో ఫేజ్ 2 వాణిజ్య చర్చలు లేనట్లేనా అని ప్రశ్నించగా.. ట్రంప్ స్పందిస్తూ.. ప్రస్తుతం తనకు ఆసక్తి లేదని స్పష్టం చేశారు.

పెన్నులో ఇంక్ కూడా ఆరకముందే..
జనవరిలో ఫేజ్ 1లో మంచి ట్రేడ్ డీల్ జరిగిందని ట్రంప్ అన్నారు. ఆ డీల్ చేసుకొని, సంతకం చేసిన ఇంక్ కూడా ఆరకముందే కరోనా వంటి మహమ్మారి ప్రపంచాన్ని దారుణంగా దెబ్బతీసిందన్నారు. ఇది చైనాలోని వూహాన్ నగరం నుండి పుట్టుకు వచ్చిందని చెప్పారు. ఈ వ్యాధి కారణంగా ప్రపంచం అల్లాడుతోందని, దీనికి చైనా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉన్నాయి. ఈ మహమ్మారి ప్రభావం ట్రంప్ గెలుపోటములపై ఉండనుంది.

బీజింగ్‌పై ఒత్తిడి పెంచే వ్యూహం
ఫేజ్ 1 వాణిజ్య ఒప్పందంలో భాగంగా అమెరికా వ్యవసాయ, తయారీ వస్తువులు, ఇంధనం, సేవలు ఉన్నాయని, రెండేళ్లలో 200 బిలియన్ డాలర్ల మేరకు కొనుగోళ్లు పెంచుతామని ప్రకటించిందని, కానీ కరోనా మహమ్మారి ఈ ఒప్పందంపై తన అభిప్రాయాన్ని మార్చి వేసిందన్నారు. హాంగ్‌కాంగ్ పైన బీజింగ్ కొత్త జాతీయ భద్రతా చట్టాన్ని అమలు చేసే చైనా అఫీషియల్స్‌తో వ్యాపారం చేసే బ్యాంకులకు జరిమానా విధించే అంశానికి సంబంధించిన పరిపాలనా చట్టంపై ట్రంప్ వర్క్ చేస్తున్నారు. తద్వారా బీజింగ్‍పై ఒత్తిడి పెంచే వ్యూహంతో సాగుతున్నారు.

జిన్ పింగ్‌తో మాట్లాడే ఉద్దేశ్యం లేదు
ప్రస్తుతం చైనా అధ్యక్షులు జీ జిన్‌పింగ్‌తో తనకు మాట్లాడే ఉద్దేశ్యం లేదని చెప్పారు ట్రంప్. 2020 అమెరికా ఎన్నికలకు ముందు రెండో దశ చర్చలు ఫలించాలని పలువురు ఆర్థికవేత్తలు, వాణిజ్య పరిశీలకులు భావిస్తున్నారు. మొదటి దశలో అమెరికా వస్తువులు చైనా కొనుగోలు, చైనా ఆర్థిక సేవల మార్కెట్‌కు మెరుగైన అమెరికా యాక్సెస్, మేధో సంపత్తి వంటి అంశాలపై దృష్టి సారించారు. ఫేజ్ 2లో క్లిష్టమైన చైనా టెక్నాలజీ ట్రాన్సుఫర్ పాలసీలు, పారిశ్రామిక అంశాలు వంటివి ఉన్నాయి.


Click it and Unblock the Notifications