China Economy: చైనా ఆర్థిక వ్యవస్థపై అమెరికా అధ్యక్షుడు షాకింగ్ కామెంట్స్.. 'టిక్కింగ్ టైమ్ బాంబ్' అంటూ..
China Economy: అంతర్జాతీయ విపణిలో భారత్ ఓ బ్రైట్ స్టార్‌గా ఎదుగుతోంది. దాదాపు అన్ని దేశాల ఆర్థిక వృద్ధి తిరగోమనంలో ఉండగా.. అనిశ్చితులను సైతం అవకాశాలుగా మార్చుకుంటూ ముందుకు సాగుతోంది. ఇదే సమయంలో పొరుగునున్న శత్రుదేశాలు చైనా, పాకిస్థాన్ మాత్రం అంతర్గత సమస్యలతో సతమతమవుతున్నాయి.
ఆర్థిక అనిశ్చితి వల్ల వివిధ దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ సమయంలో చైనాపై అగ్రరాజ్యం అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దేశీయంగా నెలకొన్న ఆర్థిక, జనాభా సమస్యలు డ్రాగన్ కంట్రీని సమస్యల్లోకి నెట్టేస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోని రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు ఇవి కాస్తా 'టిక్లింగ్ టైమ్ బాంబ్'గా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఓ పొలిటికల్ ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో జో బైడెన్ చైనా గురించి పలు వ్యాఖ్యలు చేశారు. వృద్ధి మందగించడం ఒక సమస్య అయితే, పెరుగుతున్న వృద్ధ జనాభా మరొకటన్నారు. తద్వారా అత్యధిక నిరుద్యోగిత రేటుతో ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. ఇదే సమయంలో బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్‌లో భాగంగా ఇతర దేశాలకు అప్పులిచ్చి లొంగదీసుకోవడాన్ని తప్పుపట్టారు.
చైనాలో అమెరికా పెట్టుబడులను అరికట్టడం కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉత్తర్వులను బైడెన్ ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ప్రారంభ డ్రాఫ్ట్‌లో పేర్కొన్న స్థాయిలో ప్రస్తుత ఆదేశాలు లేకపోవడం గమనార్హం. డ్రాగన్ కంట్రీతో సంబంధాలను మెరుగుపరచుకోవాలని బైడెన్ ప్రయత్నిస్తుండటంతో ఈ మేరకు మార్పులు జరిగినట్లు తెలుస్తోంది.
కరోనా ఆంక్షల అనంతరం ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటుందని భావించగా.. తీవ్ర సవాళ్లు ఎదుర్కొంటోంది. ప్రజల ఖర్చు చేసే సామర్థ్యం తగ్గడం, ఎగుమతుల మందగమనం, నిరుద్యోగం చుట్టుముట్టాయి. గతంలో దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ డెవలపర్ కంట్రీ గార్డెన్ హోల్డింగ్స్ రుణ సంక్షోభం కారణంగా రియల్ ఎస్టేట్ రంగం మందగించింది. స్థూల దేశీయోత్పత్తి వృద్ధి సహా చైనా దుందుడుకు చర్యలు డ్రాగన్ కంట్రీని మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి.


Click it and Unblock the Notifications