సుంకాలపై అమెరికా యూటర్న్.. 25 శాతం నుంచి 10 శాతానికి.. CEA అనంత నాగేశ్వరన్ కీలక వ్యాఖ్యలు
భారతదేశం త్వరలోనే అమెరికా నుండి మంచి వార్త వినబోతోంది. అమెరికా, భారత్ మధ్య వాణిజ్య సమస్యల్లో సానుకూల పరిణామాలు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వి. Anantha Nageswaran గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. భారత్‌పై ప్రస్తుతం విధించిన 25 శాతం సుంకాలను అమెరికా త్వరలో తొలగించవచ్చు. ఈ సుంకాలను 25 శాతం నుండి 10-15 శాతానికి తగ్గించేయోచనలో ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈ మార్పు సాధ్యమైతే, భారతదేశానికి ఇది మంచి శుభవార్త అవుతుంది. అమెరికాలోని భారతీయ ఉత్పత్తులపై డిమాండ్ పెరుగుతుంది. అదనపు సుంకాలను తొలగించడం, పరస్పర సుంకాలను తగ్గించడం ద్వారా భారత ఎగుమతులు గణనీయంగా పెరుగుతాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన ప్రోత్సాహం కల్పిస్తుంది. ప్రస్తుతం, భారత్ - అమెరికా వాణిజ్య విభాగాల్లో చర్చలు నడుస్తున్నాయి. న్యూఢిల్లీ, వాషింగ్టన్‌లోని అధికార ప్రతినిధులు 8-10 వారాల్లో సుంకాల సమస్యను పరిష్కరించగలరని భావిస్తున్నారు. ఇటీవల, మంగళవారం రెండు దేశాల మధ్య సుమారు ఏడు గంటల పాటు వాణిజ్య చర్చలు జరిగాయి. చర్చలు సానుకూలంగా సాగిన కారణంగా.. త్వరలో రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెప్పుతున్నారు.

ఇప్పటివరకు.. భారత్ అమెరికాకు చేసే ఎగుమతులలో దాదాపు 55 శాతం అధిక సుంకాల ప్రభావానికి లోబడి ఉన్నాయి. అత్యధికంగా ప్రభావితమయ్యే రంగాలు వస్త్రాలు, రసాయనాలు, సముద్ర ఆహారం, రత్నాలు, నగలు, యంత్రాలుగా చెప్పవచ్చు. ఆగస్టులో అమెరికాకు భారత ఎగుమతులు 6.87 బిలియన్ డాలర్లకు పడిపోయాయి, ఇది 10 నెలల్లో కనిష్ట స్థాయిగా చెప్పవచ్చు.
భారతదేశానికి అమెరికా ప్రధాన ఎగుమతి మార్కెట్‌గా కొనసాగుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో, భారత్ అమెరికాకు 86.51 బిలియన్ల డాలర్ల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది.40.82 బిలియన్ల డాలర్ల వాణిజ్య మిగులు కొనసాగడం కారణణంగా సుస్థిర వ్యాపార సంబంధాలను సూచిస్తోంది. ఈ అధిక సుంకాలను ఉపసంహరించడం భారతీయ ఎగుమతిదారులకు గణనీయమైన ఉపశమనాన్ని అందిస్తుంది. ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించే అవకాశం ఉంది.
కాగా గతంలో ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో, చమురు ధరలు తగ్గితే రష్యా రాజీ పడతుందని.. అందుకే భారతదేశంపై Tariffs విధించారని ట్రంప్ తెలిపారు. అంతేకాదు, ట్రంప్ భారతదేశంతో ఉన్న వ్యక్తిగత సంబంధాన్ని ప్రస్తావించారు. నేను భారతదేశానికి చాలా దగ్గరగా ఉన్నాను. ప్రధానమంత్రి మోదీతో చాలా మంచి సంబంధం ఉంది. పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలిపానని ఆయన అన్నారు.
ఇలాంటి పరిణామాలు, భారతదేశానికి మరింత ఎగుమతి అవకాశాలు, వాణిజ్య విస్తరణ, ఆర్థిక లాభాలు కలిగించబోతున్నాయి. త్వరలో రెండు దేశాల మధ్య ఒక సమగ్ర, పరస్పర లాభదాయక వాణిజ్య ఒప్పందం కుదిరితే, భారతీయ వ్యాపారులు, ఎగుమతిదారులు, పరిశ్రమలు ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications