Adani News: చిక్కుల్లో గౌతమ్ అదానీ.. అదానీ గ్రూప్‌పై అమెరికా న్యాయ శాఖ దర్యాప్తు..!!
Adani Group: హిండెన్ బర్గ్ సంక్షోభం ముగిసిందని ఊపిరి పీల్చుకుంటున్న వేళ అదానీపై మరో పిడిగు పడినట్లు కనిపిస్తోంది. వాస్తవానికి గత ఏడాది జనవరిలో మెుదలైన అలజడి ఇటీవలే సొమసిపోయిన సంగతి తెలిసిందే. ఈ సారి అమెరికా న్యాయ శాఖ గౌతమ్ అదానీ వ్యాపారాలపై దృష్టి సారించినట్లు సమాచారం.
అదానీ గ్రూప్ మరో విచారణ ప్రమాదంలో పడింది. అదానీ గ్రూప్ లంచాలు ఇచ్చిందనే ఆరోపణలపై యూఎస్ ప్రాసిక్యూటర్లు తమ దర్యాప్తు పరిధిని విస్తరించారు. అయితే లంచం ఆరోపణలపై దర్యాప్తుకు సంబంధించి యుఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ నుంచి గ్రూప్‌కు ఎటువంటి నోటీసు రాలేదని అదానీ గ్రూప్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ద్వారా వివరణ ఇచ్చింది. అదానీ యూనిట్ లంచాలకు పాల్పడి ఉంటుందా అనే అంశంపై న్యాయవాదులు దృష్టి సారించినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేధించింది. అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ ప్రవర్తనను కూడా దర్యాప్తులో పరిశీలిస్తున్నట్లు నివేదిక పేర్కొంది.

భారతీయ పునరుత్పాదక ఇంధన సంస్థ అజూర్ పవర్ గ్లోబల్ లిమిటెడ్‌ను కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. న్యూయార్క్‌లోని ఈస్ట్ జిల్లాకు సంబంధించిన యూఎస్ అటార్నీ కార్యాలయం, వాషింగ్టన్‌లోని న్యాయ శాఖ మోసం విభాగం దర్యాప్తు నిర్వహిస్తున్నాయి. గమనించాల్సిన విషయం ఏమిటంటే గౌతమ్ అదానీ లేదా అతని కంపెనీ ఏదైనా తప్పు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని అర్థం కాదు.ఎందుకంటే దర్యాప్తు ప్రతిసారీ విచారణకు దారితీయదు. అయితే ఈ దర్యాప్తు గురించి వార్తా పత్రికల్లో ప్రముఖంగా వచ్చిన నివేదికలు తప్పని అదానీ గ్రూప్ తన ఫైలింగ్స్ ద్వారా స్పష్టం చేసింది.
బ్లూమ్‌బెర్గ్ నివేదికకు స్పందించిన అదానీ గ్రూప్ తమ ఛైర్మన్‌పై ఎలాంటి విచారణ గురించి తమకు తెలియదని పేర్కొంది. అత్యున్నత స్థాయి పాలనా ప్రమాణాలతో పనిచేసే వ్యాపార సమూహంగా తాము అవినీతి పద్ధతులకు పూర్తిగా దూరంగా ఉండేందుకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించింది. గత ఏడాది అదానీ గ్రూప్ మోసపూరిత లావాదేవీలు, అకౌంటింగ్ ఫ్రాడ్‌తో పాటు స్టాక్ మార్కెట్ మానిప్యులేషన్‌కు పాల్పడినట్లు హిండెన్‌బర్గ్ నివేదిక విధ్వంసం కారణంగా ఇన్వెస్టర్లు ఏకంగా 111 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయారు.


Click it and Unblock the Notifications